
తాను దేశం కానీ దేశంలో కష్టపడి డబ్బు సంపాదించి పంపిస్తుంటే.. దానితో కుటుంబాన్ని పోషించాల్సింది పోయి.. వివాహేతర సంబంధం పెట్టుకుని భర్త పంపిన డబ్బుతో ప్రియుడితో కలిసి జల్సాలు చేస్తోన్న భార్యను తెగనరికాడు భర్త.
కడప జిల్లా రాయచోటి సంబేపల్లి మండలం వడ్డెపల్లికి చెందిన పసుపులేటి వెంకటరమణకు అదే గ్రామానికి చెందిన రాణితో 18 ఏళ్ల క్రితం వివాహమైంది. కొంతకాలం పాటు వీరి కాపురం హాయిగానే సాగింది. ఈ క్రమంలో ఈ దంపతులకు ఇద్దరు కుమారులు కలిగారు. కుటుంబపోషణ భారమవ్వడంతో వెంకటరమణ కువైట్‌కు వెళ్లి ఇంటికి డబ్బు పంపేవాడు.
ఈ సమయంలో పక్కనే ఉన్న దళితవాడకు చెందిన నాగేశ్వరరావు అనే వ్యక్తితో రాణికి పరిచయం ఏర్పడి.. అది వివాహేతర సంబంధానికి దారి తీసింది. విషయం తెలుసుకున్న బంధువులు రాణిని మందలించారు.. పుట్టింటికి వెళ్లిపోయినా పిల్లల భవిష్యత్తు దృష్ట్యా ఆమె తల్లిదండ్రులు రాణిని తిరిగి మెట్టింటికి పంపారు.
అయినా ఆమె మనసు మారలేదు. ఈ తరుణంలోనే ఆమె కుమారులలో ఒకరు అనుమానాస్పద స్థితిలో చనిపోయాడు. ప్రియుడి సహకారంతోనే కుమారుడిని హతమార్చిందన్న అనుమానం వెంకటరమణకు కలిగింది. నాటి నుంచి కుటుంబంలో భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి.
దీనికి తోడు కువైట్ నుంచి తాను సంపాదించిన సొమ్ముకు జమాఖర్చులు సక్రమంగా చెప్పకపోవడం.. చేసిన అప్పులు తీరకపోవడంపై రాణిని వెంకటరమణ ప్రశ్నించాడు.. సరైన సమాధానం లేకపోవడంతో వెంకటరమణ కువైట్ నుంచి ఇంటికి తిరిగొచ్చి.. రాణి కదలికలను పసిగడుతూ వచ్చాడు.
ఈ క్రమంలో మంగళవారం సాయంత్రం రాణి తన ప్రియుడు నాగేశ్వరరావుతో కలిసి బైక్‌పై వెళ్తుండగా వారిని వెంబడించి దుద్యాల చెక్‌పోస్ట్ వద్ద అడ్డుకున్నాడు. ఆ సమయంలో ప్రియుడు నాగేశ్వరరావు.. రాణిని అక్కడే దింపేసి భయంతో అక్కడి నుంచి పారిపోయాడు.
కోపంతో ఊగిపోతున్న వెంకటరమణ భార్యను చితకబాది.. సమీపంలోని పంటపొలాల్లోకి తీసుకెళ్లి గొంతుకోసి హతమార్చాడు. అప్పటికీ కోపం చల్లారకపోవడంతో ఆమె తలను మొండెం నుంచి వేరు చేసి సంచిలో పెట్టుకుని సంబేపల్లి పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నాడు.
పోలీసులు ఏంటీ..? ఎవరు..? అని అడిగే లోపు సంచిలో నుంచి తలను బయటకు తీశాడు.. అది చూసిన పోలీసు సిబ్బంది భయాందోళనకు గురయ్యారు. అనంతరం హత్య విషయం పోలీసులకు చెప్పి లొంగిపోయాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని రాణి మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.