
Marri Rajashekar : గత అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాభవాన్ని చూసి అధికారాన్ని కోల్పోయిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి షాక్ ల మీద షాక్ లు తగులుతున్నాయి. ఆ పార్టీకి కనీసం ప్రతిపక్షంగా కూడా గుర్తించేందుకు కూటమి ప్రభుత్వం ఇష్టపడటంలేదు... ఇలా శాసనసభలో బలం కోల్పోగా ఇప్పుడు శాసనమండలిలో కూడా మెళ్లిగా బలం కోల్పోతోంది. వైసిపికి చెందిన ఓ ఎమ్మెల్సీ తెలుగుదేశం పార్టీలో చేరేందుకు సిద్దమయ్యారు... ఇవాళ సాయంత్రం సీఎం చంద్రబాబు నాయుడు సమక్షంలో పసుపు కండువా కప్పుకోనున్నట్లు సమాచారం. ఆయన ఎవరో కాదు... పల్నాడు జిల్లాకు చెందిన మర్రి రాజశేఖర్.
ఈ ఏడాది ఆరంభంలో అంటే గత మార్చి 19న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీతో పాటు ఎమ్మెల్సీ పదవికి కూడా రాజీనామా చేశారు మర్రి రాజశేఖర్. అదే సమయంలో టిడిపి చేరనున్నట్లు ప్రకటించారు... కానీ వివిధ కారణాలతో ఆయన చేరిక ఆలస్యం అయ్యింది. ఎట్టకేలకు వైసిపికి రాజీనామా చేసిన ఐదునెలల తర్వాత మర్రి రాజశేఖర్ టిడిపి చేరుతున్నారు. ఉండవల్లిలోని సీఎం నివాసంలో ఆయన చేరిక కార్యక్రమం ఉంటుందని తెలుస్తోంది. ఆయనవెంట పలువురు వైసిపి నాయకులు కూడా టిడిపిలో చేరనున్నట్లు సమాచారం. ఇప్పటివరకు ఆయన రాజీనామా ఆమోదించకపోవడంతో ఎమ్మెల్సీగానే కొనసాగుతున్నారు.
మర్రి రాజశేఖర్ కు చిలకలూరిపేట నియోజకవర్గంపై మంచి పట్టు ఉంది... గతంలో ఆయన ఇండిపెండెంట్ గా పోటీచేసి గెలిచారు. ఇలా 2004లో స్వతంత్ర అభ్యర్థిగా గెలిచాక ఆనాటి అధికారపార్టీ కాంగ్రెస్ లో చేరారు. 2009 లో కాంగ్రెస్ తరపున పోటీచేసిన ఆయన ఓటపాలయ్యారు. అనంతరం వైఎస్ రాజశేఖర్ రెడ్డి అకాల మరణంతో సొంతంగా పార్టీ పెట్టుకున్న వైఎస్ జగన్ వెంట నడిచారు. ఇలా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం నుండి అదే పార్టీలో కొనసాగుతున్నారు.
2014 లో చిలకలూరిపేట నుండి మరోసారి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున పోటీచేసి ఓడిపోయారు మర్రి రాజశేఖర్. ఆ తర్వాత అతడికి మళ్లీ అవకాశం రాలేదు... ఓసారి చిలకలూరిపేట నుండి విడదల రజని, మరోసారి కావటి శివనాగ మనోహర్ నాయుడు పోటీచేశారు. కానీ అతడికి 2023 లో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీగా అవకాశం దక్కింది.
పార్టీ పెట్టినప్పటి నుండి జగన్ వెంటే ఉన్న అతడు మంత్రి పదవిని ఆశించారు... కానీ అది దక్కకుండానే వైసిపి అధికారాన్ని కోల్పోయింది. దీంతో మర్రి రాజశేఖర్ వైసిపిపై తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేస్తూ పార్టీకి, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. తాజాగా అధికార టిడిపిలో చేరుతున్నారు.