ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ ఓడిపోతే తాను నిశ్శబ్దంగా రాజకీయాల నుంచి తప్పుకుంటానని చంద్రబాబు నాయుడు వెల్లడించారు. ప్రజలు తిరస్కరిస్తే బాధపడేదేమీ లేదు అని వివరించారు. అయితే, టీడీపీ, జనసేన కూటమి గెలుస్తుందనే విశ్వాసాన్ని ఆయన ప్రకటించారు.
Chandrababu: ఏపీ మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి రాకుంటే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని స్పష్టం చేశారు. అయితే, టీడీపీ, జనసేన కూటమి తప్పకుండా అధికారంలోకి వస్తుందనే విశ్వాసాన్ని ప్రకటించారు. రిపబ్లిక్ వరల్డ్ అనే జాతీయ మీడియాకు బుధవారం ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు నాయుడు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఇదే తొలిసారేమీ కాదు. ఇటీవలే ఆయన 2024 అసెంబ్లీ ఎన్నికలే తన చివరి ఎన్నికలు అనీ పేర్కొన్నారు.
2021 నవంబర్‌లో చంద్రబాబు నాయుడు ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. తాను అసెంబ్లీకి ముఖ్యమంత్రిగానే వస్తానని, లేదంటే అసెంబ్లీకి రాబోనని చెప్పారు. అయితే, అప్పుడు ప్రజల ముందు భావోద్వేగంతో ఈ వ్యాఖ్యలు చేశారు.
తాజాగా రిపబ్లిక్ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలోనే వచ్చే ఎన్నికలే తన చివరి ఎన్నికలూ అని చంద్రబాబు నాయుడు పునరుద్ఘాటించారు. అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి రాకపోతే తప్పుకుంటారా? అని ప్రశ్నించగా.. తాను మొదటి నుంచీ తన నిర్ణయాలపై స్పష్టంగా ఉన్నానని వివరించారు. తాను జగన్ మోహన్ రెడ్డిపై తన కోసం, తన స్వప్రయోజనాల కోసం పోరాడటం లేదని చంద్రబాబు నాయుడు అన్నారు. ప్రజా ప్రయోజనాల కోసమే తాను ఈ పోరాటం చేస్తున్నారని, ప్రజలు తన వైఖరిని అర్థం చేసుకుంటారని పేర్కొన్నారు.
Also Read: TSRTC: హైదరాబాద్‌లో కొత్తగా ‘పురుషులకు మాత్రమే’ బస్సు
‘ప్రజలు మాకు అధికారం ఇస్తే.. ఓకే. మంచిది. లేదంటే పశ్చాత్తాపపడేదేమీ లేదు. ప్రజలు మమ్మల్ని తిరస్కరిస్తే నేనేమీ బాధపడను. నిశ్శబ్దంగా రాజకీయాల నుంచి రిటైర్ అవుతాను’ అని చంద్రబాబు నాయుడు విస్పష్టంగా చెప్పారు.
చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. 80 ఏళ్లకు సమీపిస్తున్న చంద్రబాబు నాయుడు ఈ కామెంట్ చేయడాన్ని అర్థం చేసుకోవచ్చని చెబుతున్నారు. అయితే, ఒక వేళ చంద్రబాబు పాలిటిక్స్ నుంచి రిటైరైతే పార్టీ బాధ్యతలను ఎవరు చేపడుతారనే ఆసక్తికర ప్రశ్న ముందుకు వస్తుంది. చంద్రబాబు నాయుడు తనయుడు లోకేశ్ పార్టీ బాధ్యతలు తీసుకుంటారా? లేక ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు ఈ పార్టీకి సారథ్యం వహిస్తారా? అనేది ఇప్పట్లో తేలేలా లేదు.