
ఎన్నికేసులున్నా చంద్రబాబునాయుడు మాత్రం పునీతుడు. అదే జగన్ మాత్రం పాపాత్ముడు, అవినీతిపరుడు. ఇదీ టిడిపి వారి లెక్క. భలేగుంది కదూ అధికారపార్టీ భాష్యం. ఓటుకునోటు కేసులో చంద్రబాబు అడ్డంగా బుక్కైపోయారు. కాకపోతే గ్రహస్ధితి బాగుండి నెట్టుకొచ్చేస్తున్నారు అందరినీ దబాయించేస్తూ. నామినేటెడ్ ఎంఎల్ఏ స్టీఫెన్ సన్ ఓటును కొనుగోలు చేస్తూ టిటిడిపి ఎంఎల్ఏ రేవంత్ రెడ్డి, అదే ఎంఎల్ఏతో ఫోన్లో మాట్లాడి చంద్రబాబు ఇద్దరూ అడ్డంగా దొరికేసారు. అయినా ఇంకా బొంకుతున్నారు. రేవంత్ రెడ్డి డబ్బుకు తనకు సంబంధం లేదని చంద్రబాబు ఇంతవరకూ చెప్పలేదు. ఫోన్లో సంభాషణలు తనవి కావని కూడా చెప్పే ధైర్యం చేయలేకపోతున్నారు.
అదే విషయమై తాజాగా మీడియాతో మాట్లాడుతూ, తనపై 26 కేసులున్నాయని చంద్రబాబే చెప్పారు. పైగా అది తనకు గర్వకారణమన్నట్లు బిల్డప్ ఇచ్చారు. తనపై ఎన్ని కేసులున్నా తనకేం కాదని చెప్పారు. మరి అదే విషయం ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డికి ఎందుకు వర్తించదు? పైగా జగన్పై ఉన్న కేసుల్లో ఒక్కటి కూడా ఇంత వరకూ నిరూపణ కాలేదు. తనపైనున్న కేసులన్నీ వాళ్ళూ వీళ్ళూ వేసినవేనని చంద్రన్న అంటున్నారు. మరి, జగన్ పైన కేసులు వేసింది కూడా కాంగ్రెస్, టిడిపి వాళ్ళే కదా? ఇవి కూడా రాజకీయ ప్రేరేపిత కేసులేగా?
జగన్ తో పోల్చుకుంటే చంద్రబాబుపైన ఉన్న కేసు ఇంకా బలంగా ఉందని న్యాయనిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే, వీడియో, ఆడియో సాక్ష్యాలున్నాయి మరి. కళ్ళెదుట సాక్ష్యాలు కనిపిస్తున్నా తాను నిప్పునని, తాను ఎప్పుడూ తప్పు చేయలేదని, తనను ఎవరూ ఏం చేయలేరని ఇంకా చెప్పుకుంటున్నారంటే చంద్రబాబు నిప్పేనని అందరూ నమ్మాల్సిందే.