చంద్రబాబుపై ఐఏఎస్ ల ఫిర్యాదు

First Published Jan 4, 2018, 7:54 AM IST
Highlights
  • చంద్రబాబునాయుడుపై ఐఏఎస్ లు ఫిర్యాదు చేసారా?

చంద్రబాబునాయుడుపై ఐఏఎస్ లు ఫిర్యాదు చేసారా? అవును ఫిర్యాదు చేసింది నిజమే. కాకపోతే ఫిర్యాదు చేసింది ఏ ప్రధానమంత్రి నరేంద్రమోడికో లేకపోతే రాష్ట్రపతికో మాత్రం కాదు. చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరికి. విచిత్రంగా ఉందా?  ఫిర్యాదు వ్యవహారం తెలియాలంటే మీరు ఈ కథనం చదవాల్సిందే.  

ఇంతకీ విషయం ఏమిటంటే, మొన్నటి డిసెంబర్ 31వ తేదీ ఆదివారం నాడు భువనేశ్వరి విజయవాడకు చేరుకున్నారు. హెరిటేజ్ ఫుడ్స్ వ్యవహారాల్లో బిజీగా ఉండే భువనేశ్వరి ప్రతీ ఆదివారం హైదరాబాద్ నుండి విజయవాడకు వెళుతున్నారు లేండి. దాంతో కుటుంబంతో గడిపేందుకని  చంద్రబాబు ఆదివారం నాడు ఎటువంటి అధికారిక కార్యక్రమాలను పెట్టుకోవటం లేదు. అందుకనే ఆరోజు ఐఏఎస్ లతో పాటు మిగిలిన అధికార సిబ్బంది కూడా చంద్రబాబు బాధ తప్పినందుకు ఊపిరి పీల్చుకుంటున్నారు.

ఇంతకీ ఉన్నతాధికారులకు చంద్రబాబుతో వచ్చిన బాధేంటి? అంటే, ఆదివారం, సోమవారం అన్న తేడా లేకుండా చంద్రబాబు ఎప్పుడు పడితే అప్పుడు గంటల తరబడి సమీక్షలని, టెలికాన్ఫరెన్సులు, వీడియో కాన్ఫరెన్సులు నిర్వహిస్తున్నారు.  దాంతో ఐఏఎస్ లతో పాటు మిగిలిన వారికి కూడా చాలా విసుగ్గా ఉంటోంది.

చెప్పిందే చెప్పటం క్షేత్రస్ధాయిలోని వాస్తవాలతో సంబంధం లేకుండా చంద్రబాబు చేస్తున్న ఊకదంపుడు ఉపన్యాసాలను అధికారులు తట్టుకోలేకపోతున్నారు. మూడున్నరేళ్ళుగా చంద్రబాబుది ఇదే వరస. దాంతో చంద్రబాబు సమావేశాలు, సమీక్షలంటేనే మంత్రులతో సహా అందరూ భయపడిపోతున్నారు.

ఇటువంటి నేపధ్యంలోనే మొన్న జనవరి1న చంద్రబాబును కలిసి శుభాకాంక్షలు చెప్పటానికి ఐఏఎస్ లందరూ సిఎం నివాసానికి చేరుకున్నారు. అక్కడ వారికి భువనేశ్వరి కనిపించారట. వెంటనే వారికి ఓ విషయం గుర్తుకు వచ్చిందట. అదేంటంటే డిసెంబర్ 31వ తేదీన చంద్రబాబు సమీక్షలు, సమావేశాలు పెట్టలేదట. ఎందుకనంటే, ఆరోజు ఆదివారం కావటమే కారణం. దాంతో వెంటనే ఐఏఎస్ అధికారులు నేరుగా భువనేశ్వరి వద్దకు వెళ్లి శుభాకాంక్షలు చెప్పటంతో పాటు చంద్రబాబుపై ఓ ఫిర్యాదు చేసారట.

ఇంతకీ ఆ ఫిర్యాదు ఏమిటంటే, ‘మీరు ఆదివారం విజయవాడకు వస్తున్న కారణంగా సిఎం సమావేశాలు, సమీక్షలు నిర్వహించటం లేదు’ అని నవ్వుతూనే అన్నారట. కాబట్టి ఇక నుండి ఆదివారం మాత్రమే కాకుండా ప్రతీ శనివారం కూడా రావాలంటూ వేడుకున్నారట. శనివారం కూడా భువనేశ్వరి విజయవాడకు వస్తే తమకు ఉపశమనంగా ఉంటుందని అన్నారట. పైకి చూడటానికి చిన్న విషయంగా ఉన్నా, చంద్రబాబుపై ఐఏఎస్ లో పెరిగిపోయిన అసహనం, అసంతృప్తికి నిదర్శనంగా కనిపిస్తోంది.

 

 

click me!