వచ్చే ఎన్నికల్లో రామచంద్రాపురం నుండి చెల్లుబోయిన వేణుకు టికెట్టు ఇస్తే తాను సమర్ధించబోనని వైఎస్ఆర్‌సీపీ ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ తేల్చి చెప్పారు.
కాకినాడ: 2024లో రామచంద్రాపురం నుండి చెల్లుబోయిన వేణును వైసీపీ అభ్యర్థిగా బరిలో దింపితే తాను ఆయన అభ్యర్థిత్వాన్ని సమర్ధించబోనని వైఎస్ఆర్‌సీపీ ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ స్పష్టం చేశారు. అంతేకాదు తాను పార్టీలో కూడ ఉండనని ఆయన చెప్పారు.
వచ్చే ఎన్నికల్లో తన కుటుంబం నుండి పోటీ చేయాలని క్యాడర్ కోరుకుంటుందని పిల్లి సుభాష్ చంద్రబోస్ చెప్పారు. పార్టీకి నష్టమైనా సరే తాను క్యాడర్ ను వదులుకోవడానికి సిద్దంగా లేనని పిల్లి సుభాష్ చంద్రబోస్ తెలిపారు. తమ కుటుంబానికి వైఎస్ఆర్‌సీపీ నాయకత్వం టికెట్ ఇవ్వకపోతే ఇండిపెండెంట్ గా బరిలోకి దిగుతామని పిల్లి సుభాష్ చంద్రబోస్ చెప్పారు. ఇవాళ మంత్రి చెల్లుబోయిన వేణు వర్గం నిర్వహిస్తున్న సమావేశానికి తనకు ఆహ్వానం అందలేదని పిల్లి సుభాష్ చంద్రబోస్ చెప్పారు. ప్రముఖ తెలుగు న్యూస్ చానెల్ ఎన్టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో సుభాష్ చంద్రబోస్ ఈ వ్యాఖ్యలు చేశారు.
undefined
గత వారం క్రితం పిల్లి సుభాష్ చంద్రబోస్ వర్గీయులు సమావేశం నిర్వహించారు. ఇవాళ మంత్రి చెల్లుబోయిన వేణు వర్గీయులు ఆత్మీయ సమ్మేళనం నిర్వహిస్తున్నారు.ఈ నెల 18వ తేదీన ఏపీ సీఎం వైఎస్ జగన్ తో ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ భేటీ అయ్యారు. ఈ సమావేశంలో పార్టీ ఇంచార్జీ మిథున్ రెడ్డి కూడ పాల్గొన్నారు. ఈ సమావేశంలో ఎంపీ సుభాష్ చంద్రబోస్ పై సీఎం జగన్ సీరియస్ అయ్యారని సమాచారం. మంత్రి చెల్లుబోయిన వేణుపై పిల్లి సుభాష్ చంద్రబోస్ ఫిర్యాదు చేసే ప్రయత్నం చేశారు. అయితే పిల్లి సుభాష్ చంద్రబోస్ తనయుడు పిల్లి సూర్యప్రకాష్ ను ఏ స్థానం నుండి పోటీ చేయించాలో తనకు తెలుసునని సీఎం జగన్ వ్యాఖ్యానించారని సమాచారం. ఈ సమావేశం తర్వాత కూడ పిల్లి సుభాష్ చంద్రబోస్ తగ్గలేదు.
also read:జగన్‌తో ముగిసిన భేటీ: వేణు పై పిల్లి ఫిర్యాదు, మీడియా కంటపడకుండా వెళ్లిపోయిన ఎంపీ
వచ్చే ఎన్నికల్లో రామచంద్రాపురం నుండి మంత్రి చెల్లుబోయిన వేణు మరోసారి బరిలోకి దిగుతారని పార్టీ రీజినల్ కో ఆర్డినేటర్ మిథున్ రెడ్డి ప్రకటించారు.ఈ ప్రకటన పిల్లి సుభాష్ చంద్రబోస్ ను తీవ్ర అసంతృప్తికి గురి చేసింది. వచ్చే ఎన్నికల్లో ఈ స్థానం నుండి తన కొడుకు సూర్యప్రకాష్ ను బరిలోకి దింపాలని పిల్లి సుభాష్ చంద్రబోస్ భావిస్తున్నారు. అవసరమైతే ఇండిపెండెంట్ గా బరిలో దిగాలని పిల్లి సుభాష్ చంద్రబోస్ భావిస్తున్నారు.చెల్లుబోయిన వేణు స్థానికేతరుడైన ఆయనను రామచంద్రాపురంలో గెలిపించామని పిల్లి సుభాష్ చంద్రబోస్ చెబుతున్నారు. అయితే మరోసారి ఆయనను బరిలోకి దింపితే మద్దతివ్వనని ఆయన తేల్చి చెప్పారు.