ఈ దఫా కచ్చితంగా పోటీ చేస్తా: తేల్చేసిన వైవీ సుబ్బారెడ్డి

By narsimha lodeFirst Published Nov 14, 2023, 12:02 PM IST
Highlights


గత ఎన్నికల్లో పోటీకి దూరంగా  ఉన్న  వైవీ సుబ్బారెడ్డి  వచ్చే ఎన్నికల్లో మాత్రం  కచ్చితంగా పోటీ చేయాలని భావిస్తున్నారు. అయితే  ఏ స్థానం నుండి పోటీ చేస్తారనే విషయమై ఆయన  స్పష్టత ఇవ్వలేదు. 


విశాఖపట్టణం: ఈ దఫా ఎన్నికల్లో  పోటీ చేస్తానని టీటీడీ మాజీ చైర్మెన్  వైవీ సుబ్బారెడ్డి  తేల్చి చెప్పారు. మంగళవారంనాడు  వైవీ సుబ్బారెడ్డి  విశాఖపట్టణంలో  మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో ఎక్కడి నుండి పోటీ చేయాలని జగన్ ఆదేశిస్తే అక్కడి నుండి పోటీ చేస్తానని ఆయన  ప్రకటించారు.  ఈ దఫా గెలిచే అభ్యర్ధులకే  టిక్కెట్లు కేటాయించనున్నట్టుగా  చెప్పారు. 

రాష్ట్రంలో  తమ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను చూసి ఓటేయాలని ప్రజలను కోరుతున్నట్టుగా  ఆయన తెలిపారు. తమ ప్రభుత్వం చేసిన కార్యక్రమాలను నచ్చితేనే ఓటు వేయాలని  కోరుతున్నట్టుగా  చెప్పారు.రాష్ట్రంలో వైఎస్ఆర్‌సీపీ సామాజిక సాధికారిత  బస్సు యాత్రకు  ప్రజల నుండి మంచి స్పందన వస్తుందని ఆయన  చెప్పారు.ఈ బస్సు యాత్రకు వస్తున్న స్పందన చూసి విపక్షాలకు భయం పట్టుకుందన్నారు.

2014లో  ఒంగోలు పార్లమెంట్ స్థానం నుండి  వైఎస్ఆర్‌సీపీ అభ్యర్ధిగా  వైవీ సుబ్బారెడ్డి  విజయం సాధించారు.  2019 ఎన్నికల్లో  వైవీ సుబ్బారెడ్డి  పార్టీ టిక్కెట్టు కేటాయించలేదు.  ఎన్నికల తర్వాత  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో  వైఎస్ జగన్ ప్రభుత్వం ఏర్పడింది. దీంతో  టీటీడీ చైర్మెన్ పదవిని  వైవీ సుబ్బారెడ్డికి జగన్ కేటాయించారు. రెండు దఫాలు ఆయన ఈ పదవిలో ఉన్నారు. ఈ పదవీ కాలం ముగిసిన తర్వాత  వైవీ సుబ్బారెడ్డి స్థానంలో  తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డికి ఈ బాధ్యతలను కేటాయించింది  ప్రభుత్వం.

ఇదిలా ఉంటే  ఈ దఫా  తాను కచ్చితంగా పోటీ చేస్తానని  వైవీ సుబ్బారెడ్డి ప్రకటించారు. ఉత్తరాంధ్ర జిల్లాల వైఎస్ఆర్‌సీపీ ఇంచార్జీగా  వైవీ సుబ్బారెడ్డి కొనసాగుతున్నారు. త్వరలోనే విశాఖపట్టణం నుండి  పాలన సాగించాలని  వైఎస్ జగన్ భావిస్తున్నారు.దీంతో ఈ తరుణంలో ఈ ప్రాంతంలో  పార్టీని బలోపేతం చేసే కార్యక్రమాన్ని  వైవీ సుబ్బారెడ్డికి అప్పగించారు జగన్. దీంతో విశాఖపట్టణం కేంద్రంగా చేసుకుని  వైవీ సుబ్బారెడ్డి కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.

వచ్చే ఎన్నికల్లో వైవీ సుబ్బారెడ్డి  ఒంగోలు పార్లమెంట్ స్థానం నుండే పోటీ చేస్తారా లేదా మరో స్థానం నుండి బరిలోకి దిగుతారా అనే విషయమై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.

click me!