
రాజంపేట : అతడు పెంచుకున్న అనుమానం భార్యపై ప్రేమను చంపేసింది. పదిహేనేళ్లగా కలిసి జీవిస్తున్న భార్యను అతికిరాతకంగా గడ్డపారతో కొట్టిచంపాడో కసాయి భర్త. ఈ దారుణం అన్నమయ్య జిల్లాలో చోటుచేసుకుంది.
పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. రాజంపేట మండలం సీతారాంపురం గ్రామానికి చెందిన రాజబోయిన గంగయ్య(45), వరమ్మ(35) భార్యాభర్తలు. వీరికి 15ఏళ్ల క్రితం వివాహమవగా ముగ్గురు పిల్లలు సంతానం. ఇలా పిల్లాపాపలతో హాయిగా సాగుతున్న వీరి జీవితంలో అనుమానమనే పెనుభూతం చిచ్చుపెట్టింది.
భార్యపై అనుమానం పెంచుకన్న రాజయ్య నిత్యం గొడవపడేవాడు. ఇలా మంగళవారం రాత్రికూడా ఇంటికి వచ్చిన అతడు భార్యను తిడుతూ గొడవ పెట్టుకున్నాడు. ఈ క్రమంలోనే ఆవేశంతో ఊగిపోయిన అతడు గడ్డపారతో భార్యను విచక్షణారహితంగా కొట్టాడు. దీంతో రక్తపు మడుగులో కుప్పకూలిన ఆమె అక్కడికక్కడే చనిపోగా అతడు అక్కడినుండి పరారయ్యాడు.
Read More సూళ్లూరుపేట ఎమ్మెల్యే ఇంట్లో పనిమనిషి ఆత్మహత్య
వరమ్మ అరుపులతో చుట్టపక్కల ఇళ్లవారు వచ్చిచూడగా అప్పటికే ఆమె మృతిచెంది పడివుంది. దీంతో వారు పోలీసులకు సమాచారం ఇవ్వగా ఘటనాస్థలికి చేరుకుని వరమ్మ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. అనంతరం కేసు నమోదు చేసుకుని పరారీలో వున్న రాజయ్య కోసం గాలింపు చేపట్టారు.
ఇలా కన్న తండ్రే తల్లిని చంపడంతో ముగ్గురు బిడ్డల జీవితాలు రోడ్డునపడ్డాయి. తల్లి మృతదేహంపై పడి వారు రోదించడం చూసేవారికి కన్నీరు తెప్పిస్తోంది. క్షణికావేశంలో రాజయ్య చేసిన పని బిడ్డల జీవితాన్ని అందకారంలోకి నెట్టింది.