
Palnadu crime: మరొకరితో అక్రమ సంబంధాన్ని(illegal affair) కొనసాగిస్తుందన్న అనుమానంతో కట్టుకున్న భార్యను అతి కిరాతకంగా నరికిచంపాడో కసాయి భర్త. ఇలా అనుమానం పెనుభూతమై భార్యభర్తల బంధానికి బీటలు వార్చి ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. ఈ అమానుషం పల్నాడు జిల్లాలో చోటుచేసుకుంది.
పోలీసులు, ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. పల్నాడు జిల్లా (palnadu district) దాచేపల్లి మండలం నడికుడి గ్రామానికి చెందిన నాగమణి-రమేష్ భార్యాభర్తలు. పెళ్ళి తర్వాత ఎంతో అన్యోన్యంగా వుండే వీరిమధ్య అక్రమసబంధం చిచ్చుపెట్టింది. భార్య మరెవరితోనో అక్రమ సంబంధాన్ని కొనసాగిస్తుందని రమేష్ కు అనుమానం మొదలవడంతో వీరి కాపురంలో గొడవలు మొదలయ్యాయి. ఇలా అనుమానంతో నిత్యం భార్యను వేధింపులకు గురిచేసేవాడు రమేష్.
అయితే తాజాగా ఈ అక్రమసంబంధం నేపథ్యంలోనే రమేష్ దారుణానికి ఒడిగట్టాడు. విచక్షణను కోల్పోయిన అతడు భార్యపై మాంసం నరికే కత్తితో దాడిచేసాడు. పదునైన కత్తితో ఇష్టంవచ్చినట్లు నరకడంతో నాగమణి రక్తపుమడుగులో పడి అక్కడికక్కడే మృతిచెందింది. ఆమె అరుపులు విని చుట్టుపక్కల ఇళ్లవారు చేరుకున్నా అప్పటికే ఆమె మృతిచెంది, చేతిలో రక్తంకారుతున్న కత్తితో రమేష్ కనిపించాడు. దీంతో స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు.
వెంటనే ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించారు. హత్యకు ఉపయోగించిన కత్తితో పాటు ఇతర ఆదారాలను సేకరించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏరియా ఆస్పత్రికి తరలించారు. భార్యను కిరాతకంగా హతమార్చి పారిపోకుండా అక్కడే వున్న నిందితుడు రమేష్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఇదిలావుంటే ఖమ్మంలో ఇలాంటి దారుణమే చోటుచేసకుంది. మరో యువకుడితో భార్య అక్రమసంబంధాన్ని కొనసాగిస్తున్నట్లు తెలిసి ఓ భర్త ఆగ్రహం కట్టలుతెంచుకుంది. దీంతో భార్యతో పాటు ఆమె ప్రియుడిపై కత్తితో దాడిచేసి హత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ దాడిలో మహిళ తీవ్రంగా గాయపడగా ఆమె ప్రియుడు ప్రాణాలు కోల్పోయాడు.
ఖమ్మం జిల్లాలోని రఘునాథపాలెం మండలం అల్లీపురంలో కల్పన-నవీన్ దంపతులు నివాసముండేవారు. అదే గ్రామానికి చెందిన గట్ల నవీన్ తో ఆమెకు పరిచయం ఏర్పడి అదికాస్తా వివాహేతర సంబంధానికి దారితీసింది. ఈ విషయం తెలుసుకున్న కల్పన భర్త వీరబాబు దారుణానికి ఒడిగట్టాడు.
రాత్రి సమయంలో నవీన్ ను ఖమ్మం శివారు ప్రాంతం గోపాలపురం వద్దకు రమ్మని కల్పనతో ప్రియుడు నవీన్ కు ఫోన్ చేయించాడు వీరబాబు. అతడు అక్కడికి రాగానే కల్పన భర్త వీరబాబు నవీన్ మీద విచక్షణారహితంగా కత్తితో దాడి చేయడంతో అక్కడే కుప్పకూలిపోయాడు. ఈ ఘటనలో కల్పనకు కూడా స్వల్ప గాయాలు అయ్యాయి. ఈ విషయం తెలుసుకున్న నవీన్ బంధువులు వెంటనే అతడిని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కానీ అప్పటికే అతడు ప్రాణాలు కోల్పోయాడు.