తిరుమలలో భక్తుల రద్దీ... శ్రీవారి దర్శనానికి 18 గంటల సమయం..

By Sumanth KanukulaFirst Published Jan 1, 2023, 9:33 AM IST
Highlights

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. నేడు న్యూ ఇయర్ కావడంతో శ్రీవారిని దర్శించుకునేందుకు భారీగా భక్తులు తరలివచ్చారు. 

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. నేడు న్యూ ఇయర్ కావడంతో శ్రీవారిని దర్శించుకునేందుకు భారీగా భక్తులు తరలివచ్చారు. మరోవైపు రేపటి నుంచి పది రోజులు వైకుంఠద్వార దర్శనం ఉండటంతో భక్తులు భారీగా తిరుమలకు తరలివస్తున్నారు. శ్రీవారి దర్శనానికి 18 గంటల సమయం పడుతుంది. శ్రీవారి దర్శనానికి 15 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. ఇదిలా ఉంటే.. శనివారం శ్రీవారిని 78,460 మంది భక్తులు దర్శించుకున్నారు. 29,182 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. హుండీ ఆదాయం రూ.4.03 కోట్లుగా ఉంది. 

ఇదిలా ఉంటే..  జనవరి 2 నుంచి 11వ తేదీ వరకు పది రోజుల పాటు భక్తులకు వైకుంఠ ద్వార దర్శనాన్ని కల్పిస్తున్నారు. ఎక్కువ సంఖ్యలో సామాన్య భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం కల్పించేందుకు టీటీడీ అధికారులు చర్యలు తీసుకున్నారు. జనవరి 2 నుంచి 11 వరకు రోజుకు 45,000 చొప్పున స్లాటెడ్ సర్వ దర్శనం టోకెన్లను ఆఫ్‌లైన్‌లో జారీ చేయాలని నిర్ణయించారు.  తిరుపతిలోని 9 ప్రదేశాల్లో 92 కౌంటర్ల ద్వారా ఈ రోజు తెల్లవారుజామున 3 గంటల నుంచి టోకెన్ల జారీ ప్రక్రియను ప్రారంభించారు.

అయితే  శ్రీవాణి ట్రస్ట్ టిక్కెట్లు ఆఫ్‌లైన్‌లో జారీ చేయబడవని టీటీడీ అధికారులు తెలిపారు. ‘‘జనవరి 2 నుంచి 11 వరకు  ఆన్‌లైన్‌లో రోజుకు 2000 చొప్పున శ్రీవాణి టిక్కెట్‌లను ఇప్పటికే విడుదల చేసాం. ఆఫ్‌లైన్‌లో టిక్కెట్లు జారీ చేయబడవు. అదే విధంగా మేము ఆన్‌లైన్‌లో జనవరి 1 నుంచి 11 వరకు 2.05 లక్షల ప్రత్యేక ప్రవేశ దర్శన (రూ. 300) టిక్కెట్‌లను కూడా జారీ చేసాం. జనవరి 1న నూతన సంవత్సరం, జనవరి 2న వైకుంఠ ఏకాదశి, జనవరి 3న వైకుంఠ ద్వాదశి దృష్ట్యా డిసెంబర్ 29 నుంచి జనవరి 3 వరకు వసతి ముందస్తు బుకింగ్‌లు రద్దు చేయబడ్డాయి’’అని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఇటీవల తెలిపారు.
 

click me!