పోలవరం నీళ్ళిస్తామని ప్రజల చెవిలో బాబు పూలు: జగన్

First Published 12, Jun 2018, 5:44 PM IST
Highlights

బాబుపై జగన్ హాట్ కామెంట్స్

రాజమండ్రి: పోలవరం ప్రాజెక్టు గురించి చంద్రబాబునాయుడు ప్రజల చెవుల్లో పూలు పెడుతున్నారని  వైసీపీ చీఫ్ వైఎస్ జగన్ విమర్శించారు. ప్రాజెక్టు పనులు నత్తనడకన సాగుతోంటే ఎలా వచ్చే ఏడాది నీళ్లు ఇస్తారని ఆయన ప్రశ్నించారు. ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో పోలవరం ప్రాజెక్టు నిర్మాణం విషయంలో బాబు అడుగడుగునా అడ్డుపడ్డాడని జగన్ విమర్శించారు.పోలవరం ప్రాజెక్టు అంచనాలను విపరీతంగా పెంచుకొంటూ పోయారని ఆయన విమర్శించారు.

వైసీపీ చీఫ్ వైఎస్ జగన్ పాదయాత్ర పశ్చిమగోదావరి జిల్లా నుండి తూర్పు గోదావరి జిల్లాలోకి మంగళవారం నాడు చేరుకొంది. రాజమండ్రి రోడ్డు కమ్ రైలు బ్రిడ్జి ద్వారా వైఎస్ జగన్ పాదయాత్ర రాజమండ్రికి చేరుకొంది. రాజమండ్రిలోని కోటిపల్లి బస్టాండ్ వద్ద నిర్వహించిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు.


నాలుగేళ్ళుగా చంద్రబాబునాయుడు రాష్ట్ర ప్రజలకు సినిమాలు చూపిస్తున్నారని జగన్ విమర్శించారు. అమరావతి పేరుతో మొదటి సినిమాను చూపిస్తున్నాడని ఆయన ఆరోపించారు. రెండోది పోలవరం ప్రాజెక్టు అంటూ రెండో సినిమాను చూపిస్తున్నారని ఆయన విమర్శలు గుప్పించారు.


పోలవరం ప్రాజెక్టు పునాదులు కూడ దాటలేదని జగన్ విమర్వించారు. వైఎస్ హయాంలో పరుగులు పెట్టిన పోలవరం ప్రాజెక్టు బాబు హయంలో నత్తనడకన సాగుతోందని జగన్ విమర్శించారు. పోలవరం ఎడమ, కుడి కాల్వలు 90 శాతం వైఎస్ఆర్ హయంలోనే పూర్తయ్యాయని ఆయన చెప్పారు.

గతంలో చంద్రబాబునాయుడు ఏపీ రాష్ట్రానికి 9 ఏళ్ళ పాటు  సీఎంగా ఉన్నారు. ఆనాడు పోలవరం ప్రాజెక్టు గురించి ఎందుకు పట్టించుకోలేదని ఆయన ప్రశ్నించారు. ఆనాడు పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయాలని డిమాండ్ తో టిడిపి ఎమ్మెల్యే వడ్డి వీరభద్రరావు ఢిల్లీకి సైకిల్ యాత్ర చేసిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు.  టిడిపి పోలవరం ప్రాజెక్టు గురించి పట్టించుకోకపోవడంతో ఆయన పార్టీకి కూడ రాజీనామా చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. 

పోలవరం ప్రాజెక్టు నిర్మాణంపై బాబుకు చిత్తశుద్ది లేదని  బాబు చెప్పారు. గోదావరి పుష్కరాల పేరుతో జనం సొమ్మును లూఠీ చేశారని ఆయన ఆరోపించారు. పేదలకు ఇచ్చిన ప్లాట్లను కూడ లాక్కొని రూ.6.50 లక్షలకు ఇచ్చేందుకు బాబు ప్రయత్నిస్తున్నారని ఆయన చెప్పారు. తాము అధికారంలోకి రాగానే ఈ రుణాన్ని మాఫీ చేస్తామని ఆయన చెప్పారు.

వైఎస్ఆర్ నాడు రాజమండ్రికి ఏ దారిలో వచ్చారో తాను కూడ అదే దారిలో వచ్చిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.ఈ రోజు తనకు ప్రజలు పలికిన అపూర్వ స్వాగతం జీవితంలో మర్చిపోలేనని ఆయన చెప్పారు. పేదల  సమస్యలకు బాబుకు పట్టలేదన్నారు. ఇసుకను కూడ బాబు దోచుకొంటున్నారని జగన్ ఆరోపించారు. 

మోసం చేయడంలో బాబు పీహెచ్ డీ చేశారని జగన్ దుయ్యబట్టారు.పోలవరం ప్రాజెక్టు  డయా ఫ్రం వాల్ సమాధితో సమానమని జగన్ విమర్శించారు. ప్రతి పనిలో బాబు అవినీతికి పాల్పడుతున్నాడని ఆయన ఆరోపించారు. అవినీతిలో బాబు నెంబర్ వన్ గా నిలిచారని ఆయన చెప్పారు.

Last Updated 12, Jun 2018, 5:44 PM IST