ఆక్సిజన్ కొరతను అధిగమించే దిశగా... మంత్రి మేకపాటి కీలక ఆదేశాలు (వీడియో)

By Arun Kumar PFirst Published Apr 22, 2021, 1:47 PM IST
Highlights

కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు జిల్లాలకు యుద్ధప్రాతిపదికన ఆక్సిజన్ సరఫరా చేయాలని అధికారులకు మంత్రి మేకపాటి ఆదేశించారు. 

అమరావతి: ఆంధ్ర ప్రదేశ్ లో ప్రస్తుతానికి ఆక్సిజన్ లోటు లేదని పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి స్పష్టం చేశారు. ఆక్సిజన్ విషయంలో మన రాష్ట్రానికే మొదటి ప్రాధాన్యత అని... రాష్ట్ర అవసరాల తర్వాతే ఇతర రాష్ట్రాలకు సరఫరా చేస్తామన్నారు. ఆక్సిజన్ సరపరా జరుగుతున్న తీరును పర్యవేక్షించడానికి ప్రత్యేక అధికారులను ఏర్పాటు చేశారు.  40 రకాల పరిశ్రమల ద్వారా 510 ఎం.టీ మెడికల్ ఆక్సిజన్ తయారీకి ఏర్పాట్లు చేసినట్లు మంత్రి తెలిపారు.  

కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు జిల్లాలకు యుద్ధప్రాతిపదికన ఆక్సిజన్ సరఫరా చేయాలని అధికారులకు మంత్రి ఆదేశించారు. ఇబ్బంది లేని చోట చేసిన పని కన్నా, సమస్యలున్నపుడు సాధిస్తేనే పనికి విలువని మంత్రి మేకపాటి వ్యాఖ్యానించారు. 

మంత్రి గౌతమ్ రెడ్డి ఇవాళ హోం శాఖ కార్యదర్శి కుమార్ విశ్వజిత్,  పరిశ్రమల శాఖ డైరెక్టర్ సుబ్రహ్మణ్యం జవ్వాది, వైద్య శాఖ, ఆక్సిజన్ సరఫరాకు సంబంధించిన నోడల్ అధికారి షన్ మోహన్,   13 జిల్లాల పరిశ్రమల శాఖ అధికారులు, ఆర్ఐఎన్ఎల్, ఎల్లెన్ బెర్రీ తదితర పరిశ్రమలకు చెందిన ప్రతినిధులతో సమావేశమయ్యారు. రాష్ట్రంలో ఆక్సిజన్ ఉత్పత్తి చేసే పరిశ్రమల వివరాలను మంత్రి మేకపాటికి వివరించారు పరిశ్రమల శాఖ డైరెక్టర్ సుబ్రహ్మణ్యం జవ్వాది.

వీడియో

ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా వ్యాప్తి , ఆక్సిజన్ అవసరాలు, మొదటి వేవ్ లో వినియోగించిన ఆక్సిజన్ సామర్థ్యాలపై ప్రజంటేషన్ ఇచ్చారు పరిశ్రమల శాఖ డైరెక్టర్. కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర రాష్ట్రాల్లో ఆక్సిజన్ వినియోగం, ఉత్పత్తి, అవసరాలపైనా చర్చించారు గౌతమ్ రెడ్డి. 

''రాష్ట్రంలో ముఖ్యంగా 3 చోట్ల నుంచి ఆక్సిజన్ సరఫరా జరుగుతోంది. ఆర్ఐఎన్ఎల్  ఆక్సిజన్ ఉత్పత్తిలో 50 శాతం ఆక్సిజన్ ను ఆంధ్రప్రదేశ్ వాటాగా తీసుకుంటోంది. మిగతాది మహారాష్ట్రకు సరఫరా చేస్తుంది. ఎల్లెన్ బెర్రీ 40 టన్నుల ఉత్పత్తి చేస్తోంది.  లికినాక్స్ కంపెనీల ద్వారా కూడా ఆక్సిజన్ ఉత్పత్తి జరుగుతోంది. మొత్తం ఆక్సిజన్ ఉత్పత్తి రాష్ట్ర అవసరాలకే వాడుతున్నాం. మన రాష్ట్రానికి సరిపడా ఉన్నప్పుడే పొరుగు రాష్ట్రాలకూ సరఫరా చేయాలి'' అని అధికారులకు మంత్రి ఆదేశించారు. 

read more   కరోనా కలకలం... నా సొంతజిల్లాలో ఇదీ పరిస్థితి: మంత్రి మేకపాటి ఆందోళన

 స్థానిక ఆసుపత్రులకు ఆక్సిజన్ ను సరఫరా చేస్తున్నారో లేదో నిశితంగా నిఘా పెడితే బాగుంటుందన్నారు నోడల్ అధికారి మోహన్. మెడికల్ ఆక్సిజన్ సరఫరాపై కచ్చితంగా క్షేత్రస్థాయి నిఘా పెడతామన్నారు  మంత్రి. ఆక్సిజన్ దిగుమతుల విషయంలో రోడ్డు రవాణా ప్రధాన సమస్యగా మారిందని మోహన్ తెలపగా.... రవాణా దూర, భార, ప్రాణాలకు సంబంధించిన విషయం కావడంతో రిస్క్ ఉంటుందన్నారు మంత్రి మేకపాటి. ఈ విషయంలో కేంద్రంతో మాట్లాడి ప్రత్యామ్నాయ చర్యలు చేపడతామని మంత్రి వెల్లడించారు. 

''బళ్లారి నుంచి 68 ఎం.టీ ఆక్సిజన్ దిగుమతి వల్ల రాయలసీమకు ఉపశమనం కలుగుతోంది. కృష్ణా,  గుంటూరు, ప్రకాశం , కర్నూలులో కొంత భాగం, నెల్లూరులో మరికొంత భాగం ప్రధానంగా ఆక్సిజన్ కొరతకు సంబంధించిన ఇబ్బందులు గుర్తించాం'' అని మంత్రి తెలిపారు.

మెడ్ టెక్ జోన్ లో కూడా ఆక్సిజన్ ఉత్పత్తి జరుగుతుందని... దాన్ని కూడా వినియోగించుకోవాలని మంత్రి మేకపాటి దిశానిర్దేశం చేశారు. మే 1వ తేదీ నుంచి రోజుకి 2400 క్యూబిక్ మీటర్ల సామర్థ్యంతో ఆక్సిజన్ (లిక్విడ్ కాదు)ఉత్పత్తి జరుగుతందని మంత్రి తెలిపారు.  2, 3 నెలల్లో 20 నుంచి 30 ప్లాంట్ల ద్వారా ఎక్కువ ఆక్సిజన్ ఉత్పత్తి చేసేలా కార్యాచరణ ఏర్పాట్లపై మెడ్ టెక్ జోన్ నుంచి నివేదిక కోరారు మంత్రి గౌతమ్ రెడ్డి. ఎట్టి పరిస్థితుల్లో ప్రతి రోజూ 300 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ ఉత్పత్తి చేసే దిశగా మంత్రి దిశానిర్దేశం చేశారు. 

ఇవాళ సాయంత్రం కల్లా ఏ జిల్లాకు ఎంత అవసరం, ఏ పరిశ్రమ ఎంత ఆక్సిజన్ ఉత్పత్తి చేస్తుంది,  భవిష్యత్ లో ఇంకా ఎంత కావాలి? అన్ని విషయాలపై పూర్తి స్తాయి నివేదిక అందించాలని పరిశ్రమల శాఖకు మంత్రి ఆదేశించారు. ఉత్తరాంధ్రలోని సుమారు 12 ఆసుపత్రులకు శ్రీకాకుళం జిల్లా లికినాక్స్ పరిశ్రమ నుంచి ఆక్సిజన్ సరఫరా చేస్తున్నామని ఆ పరిశ్రమకు చెందిన ప్రతినిధి రాజేశ్ బాబు తెలిపారు. తయారు చేసినంత వేగంగా తరలించకపోవడం ఆక్సిజన్ సరఫరాలో ప్రధాన సవాల్ గా మారిందని వెల్లడించారు.

 
 

click me!