ఆ నలుగురు మంచి మిత్రులు: వల్లభనేని వంశీతో చిచ్చు

By narsimha lodeFirst Published Oct 29, 2019, 4:14 PM IST
Highlights

కృష్ణా జిల్లాలో  నలుగురు మిత్రులున్నారు. రాజకీయంగా వేర్వేరు పార్టీల్లో ఉన్నారు. అయితే ఈ నలుగురు మిత్రులు ఒకే పార్టీలో కొనసాగుతారా లేదా అనేది కొంత కాలం తర్వాత స్పష్టత రానుంది.


విజయవాడ: రాజకీయంగా వేర్వేరు పార్టీల్లో ఉన్నా కూడ ఆ నలుగురు మంచి స్నేహితులు. తరచూ కలుసుకొని మాట్లాడుకొంటారు.ఈ నలుగురు మిత్రులు వేర్వేరు పార్టీల్లో ఉన్నప్పటికీ రానున్న రోజుల్లో ముగ్గురు మిత్రులు ఒకే పార్టీలో చేరే అవకాశం ఉందా అనే చర్చ కృష్ణా జిల్లా రాజకీయాల్లో సాగుతోంది.

Also read:Also Read:వల్లభనేని వంశీ ఎపిసోడ్: ఆ ఎమ్మెల్యే కూడా టచ్‌లో ఉన్నారన్న బీజేపీ

గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఈ నెల 27న టీడీపీ ప్రాథమిక సభ్యత్వానికి, గన్నవరం ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. అంతేకాదు రాజకీయాలకు దూరంగా ఉంటానని ప్రకటించారు. వల్లభనేని వంశీ వైసీపీలో చేరేందుకు రంగం సిద్దం చేసుకొన్నారని ప్రచారం సాగుతున్న తరుణంలో రాజకీయాలకు దూరంగా ఉంటానని వంశీ ప్రకటించడం వ్యూహాత్మకమేననే అభిప్రాయాలు కూడ లేకపోలేదు.

Also Read:జగన్ తో వల్లభనేని వంశీ భేటీ వెనక... టీడీపీ జిల్లా నాయకత్వంపై కార్యకర్తలు ఫైర్

కృష్ణా జిల్లా రాజకీయాల్లో నలుగురు మిత్రుల గురించి  ప్రస్తుతం చర్చ సాగుతోంది. ఏపీ రాష్ట్ర పౌరసరఫరాల శాఖమంత్రి కొడాలి నాని, గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, గన్నవరం వైసీపీ ఇంచార్జీ  యార్లగడ్డ వెంకట్రావు, మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ మంచి మిత్రులు.

Also Read:వల్లభనేని వంశీ ఎఫెక్ట్, అఖిలప్రియ భర్తపై కేసు: జగన్ పై చంద్రబాబు భగ్గు

కొడాలినాని 2011 తర్వాత టీడీపీని వీడి వైసీపీలో చేరారు. కొడాలినాని, గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ  మంచి మిత్రులు. వీరితో మరింత సాన్నిహిత్యంగా ఉండేది మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ. రాజకీయాల్లోకి రాకముందు గన్నవరం వైసీపీ ఇంచార్జీ యార్లగడ్డ వెంకట్రావుతో కూడ వల్లభనేని వంశీకి పరిచయం ఉందని చెబుతారు. ఈ ముగ్గురు మిత్రులతో కూడ వెంకట్రావుకు సంబంధాలు ఉన్నాయని అంటారు.

టీడీపీలో ఉన్న సమయంలో కొడాలినానితో గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి మంచి సంబంధాలు ఉన్నాయి. కొడాలి నాని పార్టీ మారినా కూడ ఈ సంబంధాలు మాత్రం కొనసాగుతున్నాయి. ఇద్దరు మిత్రులు జూనియర్ ఎన్టీఆర్ కు అత్యంత సన్నిహితులు.

జూనియర్ ఎన్టీఆర్ సినిమాలను వీరిద్దరూ కూడ నిర్మించిన సందర్భాలు కూడ లేకపోలేదు.  తాను ఎదుర్కొంటున్న ఇబ్బందులు, కేసుల గురించి గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మంత్రి కొడాలి నాని వద్ద తన అభిప్రాయాలను వెల్లడించినట్టుగా సమాచారం. 

ఎన్నికలకు ముందు వల్లభనేని వంశీపై కేసులు తిరగదోడారు. హైద్రాబాద్‌లో ఓ కేసుకు సంబంధించి  వల్లభనేని వంశీకి నోటీసులు పంపారు. ఈ విషయమై ఆ సమయంలో చంద్రబాబునాయుడు ఎన్నికల ప్రచార సభల్లో కూడ ఈ విషయాన్ని ప్రస్తావించారు. అంతేకాదు హైద్రాబాద్‌లో ఓ స్థలానికి సంబంధించి జీహెచ్‌ఎంసీ అధికారలుు నోటీసులు కూడ ఇచ్చారు. ఎన్నికల ముందు వంశీ ఆర్ధిక ఇబ్బందుల్లో ఉంటే  ఆ సమయంలో  చంద్రబాబునాయుడు, సుజనా చౌదరిలు కొంత మేరకు ఆర్ధిక సహాయం చేసినట్టుగా టీడీపీ వర్గాల్లో ప్రచారంలో ఉంది.

గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై నకిలీ ఇళ్ల పట్టాల పంపిణీకి సంబంధించి కేసులు నమోదయ్యాయి.  ఈ కేసు నమోదు వెనుక రెవిన్యూ అధికారులతో వైసీపీ నేత యార్లగడ్డ వెంకట్రావు  చేయించారని వంశీ ఆరోపించారు. ఈ మేరకు వల్లభనేని వంశీ ఈ నెల 24 వ తేదీన మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఈ వివరాలను వెల్లడించారు.

ఈ నెల 25 వ తేదీన వల్లభనేని వంశీ ఏపీ సీఎం జగన్ ను కలిశారు. వైసీపీలో చేరేందుకే జగన్ ను వల్లభనేని వంశీ కలిశారనే ప్రచారం సాగింది. దీపావళి తర్వాత జగన్ సమక్షంలో వంశీ వైసీపీలో చేరుతారనే ప్రచారం సాగింది. వైసీపీలో వల్లభనేని వంశీ చేరడాన్ని స్థానిక వైసీపీ క్యాడర్ తీవ్రంగా వ్యతిరేకించింది. ఈ పరిణామాల నేపథ్యంలో వల్లభనేని వంశీ ఈ నెల 27వ తేదీన రాజకీయాలకు దూరంగా ఉంటానని ప్రకటించారు. టీడీపీ, గన్నవరం ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నట్టుగా ప్రకటించారు.

2019 ఎన్నికలకు ఏడాది ముందు ఆకస్మాత్తుగా ఆ నలుగురు స్నేహితుల్లో ఒకరైన యార్లగడ్డ వెంకట్రావు రంగప్రవేశం చేశారు. ఆయనను గన్నవరానికి తీసుకొచ్చి తనకు ప్రత్యర్థిగా నిలిపారని, ఇందులో కొడాలి నాని పాత్ర ఉందనీ వంశీ నవ్వుతూనే అంటుండేవారు.

చివరకు ఇప్పుడు కొడాలి నాని, వంశీ ఒకటై జగన్ వద్దకు వెళ్లగా, మరో స్నేహితుడైన వంశీ ప్రత్యర్థి యార్లగడ్డ వెంకట్రావు ఇబ్బందుల్లో పడ్డారు. ఇంత జరిగినా కూడా తనకు సీఎం జగన్‌పై నమ్మకం ఉందని వెంకట్రావు అంటున్నారు.
  
అయితే ఈ నలుగురు మిత్రుల్లో వంశీ వైసీపీలో చేరితే ముగ్గురు మిత్రులు ఒకే పార్టీలో ఉంటారు. వల్లభనేని వంశీ వైసీపీలో చేరితే యార్లగడ్డ వెంకట్రావు ఏం చేస్తారనేది ప్రస్తుం హాట్ టాపిక్ గా మారింది. గతంలో వైసీపీలో ఉన్న వంగవీటి రాధా ఎన్నికల ముందు టీడీపీలో చేరారు. ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. జనసేనలో చేరేందుకు రాధా  రంగం సిద్దం చేసుకొన్నారనే ప్రచారం సాగుతోంది. నలుగురు మిత్రుల్లో ఎవరెవరు ఏ పార్టీలో ఉంటారనేది త్వరలోనే తేలనుంది

click me!