తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గంలో రహదారి మూసివేత ఉద్రిక్తతలకు దారి తీసింది. పది గ్రామాల మీదుగా వెళ్తున్న రోడ్డును లాంకో, ఈసీఐఎల్ యాజమాన్యం మూసివేసింది.
తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గంలో రహదారి మూసివేత ఉద్రిక్తతలకు దారి తీసింది. గ్రామస్తుల దాడిలో పలువురు పోలీసులకు గాయాలయ్యాయి. పది గ్రామాల మీదుగా వెళ్తున్న రోడ్డును లాంకో, ఈసీఐఎల్ యాజమాన్యం మూసివేసింది. దీంతో చిందేపల్లి గ్రామంలో మూడు రోజులుగా ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నారు గ్రామస్తులు. జనసేన పార్టీ నేత వినూత మూడు రోజులుగా గ్రామస్తులతో కలిసి నిరాహారదీక్ష చేస్తున్నారు.
అయితే నిరాహార దీక్ష చేస్తుండటంతో ఆమె ఆరోగ్యం క్షీణించింది. దీంతో దీక్షను భగ్నం చేసేందుకు పోలీసులు ప్రయత్నించారు. దీనిని గ్రామస్తులు అడ్డుకోవడంతో వారిపై పోలీసులు లాఠీఛార్జ్ చేశారు. ఇది జనానికి ఆగ్రహం తెప్పించింది. ఇరుపక్షాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొనడంతో పాటు పోలీసులపై జనం రాళ్లు రువ్వారు. అయినప్పటికీ నిరాహారదీక్షను చేస్తున్న వారిని బలవంతంగా పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ప్రస్తుతం గ్రామంలో ఉద్రిక్త పరిస్ధితులు చోటు చేసుకున్నాయి. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.