ఢిల్లీ చేరుకున్న సీఎం జగన్.. కాసేపట్లో అమిత్ షాతో భేటీ.. !

By Sumanth KanukulaFirst Published Mar 29, 2023, 5:40 PM IST
Highlights

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఢిల్లీకి చేరుకున్నారు. అక్కడ ఆయనకు  వైసీపీ ఎంపీలు, నాయకులు స్వాగతం పలికారు.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఢిల్లీకి చేరుకున్నారు. అక్కడ ఆయనకు  వైసీపీ ఎంపీలు, నాయకులు స్వాగతం పలికారు. ఈరోజు రాత్రి 9.30 గంటల సమయంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో సీఎం జగన్ సమావేశమయ్యారు. ఈ సమావేశంలో రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలపై అమిత్ షాతో సీఎం జగన్ చర్చించనున్నట్టుగా తెలుస్తోంది. అయితే సీఎం జగన్ రాత్రి ఢిల్లీలోనే బస చేస్తారా? లేదా తిరుగు ప్రయాణమవుతారా? అనే అంశంలో స్పష్టత రావాల్సి ఉంది. 

ఇదిలా ఉంటే.. ఢిల్లీ పర్యటన కోసం సీఎం జగన్ ఈ రోజు ముఖ్యమంత్రి మధ్యాహ్నం 2 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో సాయంత్రం 5 గంటల సమయంలో ఢిల్లీకి చేరుకున్నారు. 

ఇక, 15 రోజుల వ్యవధిలోనే సీఎం జగన్ మరోసారి ఢిల్లీ పర్యటనకు వెళ్తుండటం రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ నెల 16వ తేదీన ఢిల్లీకి వెళ్లిన సీఎం జగన్.. ఆ మరుసటి  రోజు ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాలతో వేర్వురుగా భేటీ అయ్యారు. అయితే తాజాగా మరోసారి సీఎం జగన్ ఢిల్లీ పర్యటనకు వెళ్తుండటంపై పలు రకాల ప్రచారాలు సాగుతున్నాయి. ఢిల్లీ పర్యటనకు ముందు.. సీఎం జగన్ సోమవారం గవర్నర్ జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్‌ను కలిశారు. ఏపీ బడ్జెట్ సమావేశాల అనంతరం మర్యాదపూర్వకంగా గవర్నర్‌‌ను సీఎం జగన్ కలిశారని చెబుతున్నప్పటికీ.. అసెంబ్లీకి ముందస్తు ఎన్నికలకు వెళ్లాలనే యోచనలో సీఎం జగన్ ఉన్నారనే ప్రచారం విస్తృతంగా సాగుతుంది. 

click me!