సలహాదారులు : జగన్ ప్రభుత్వంపై హైకోర్టు సంచలన వ్యాఖ్యలు

By SumaBala BukkaFirst Published Jan 20, 2023, 8:09 AM IST
Highlights

ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వ సలహాదారుల నియామకంపై ఏపీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. సలహాదారుల నియామకం ప్రమాదకరమైన విషయం అని సంచలన వ్యాఖ్యలు చేసింది. 

అమరావతి : ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ సలహాదారులను నియమించే విషయంపై హైకోర్టు మరోసారి తీవ్రంగా స్పందించింది. జగన్ ప్రభుత్వంపై ఘాటు విమర్శలు చేసింది. ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమానికి సలహాదారు నియామకం ఏమిటి అని ఆశ్చర్యం వ్యక్తం చేసింది. అంతేకాదు ఉద్యోగులకు టీఏ, డీఏలు ఇచ్చేందుకు కూడా సలహాదారులను ఈ ప్రభుత్వం నియమిస్తుంది ఏమో అని అనుమానాన్ని వ్యక్తం చేసింది.  ప్రతి చిన్న విషయానికి సలహాదారులను ఏర్పాటు చేసుకుంటూ పోతే అది ప్రభుత్వానికి సమాంతర వ్యవస్థగా తయారవుతుందని ఆందోళన వ్యక్తం చేసింది.  ఇలా సలహాదారులను నియమించుకుంటూ పోతే అది ప్రమాదానికి దారితీస్తుందని ఘాటుగా వ్యాఖ్యానించింది.

అన్ని విషయాలకు సలహాదారులను నియమించడం విషయంపై ప్రభుత్వ తీరుపై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, జస్టిస్ డివిఎస్ఎస్ సోమయాజులతో కూడిన ధర్మాసనం తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేసింది. ఈ క్రమంలోనే ఈ వ్యాఖ్యలు చేసింది.  దేవాదాయ శాఖకు సలహాదారుగా జ్వాలాపురపు శ్రీకాంత్ ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో 630 ని జారీ చేసింది. దీనిని సవాల్ చేస్తూ ఏపీ బ్రాహ్మణ సేవా సంఘాల సమాఖ్య అధికార ప్రతినిధి రాజశేఖర్ రావు హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. ఈ విషయం అందరికీ తెలిసిందే.

విశాఖపట్నంలో విషాదం.. ఇద్దరు కూతుర్లను చంపి, తండ్రి ఆత్మహత్య..

ఇక, రిటైర్డ్ ఎంప్లాయ్ మునెయ్య ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమ సలహాదారుగా ఎన్ చంద్రశేఖర్ రెడ్డి నియామకాన్ని సవాల్ చేశారు. ఈ మేరకు కోర్టులో మరో పిల్ దాఖలు చేశారు. అయితే కోర్టు ఈ వ్యవహారంపై గతంలో విచారణ జరిపింది. సలహాదారులుగా వారి నియామకంలోని రాజ్యాంగబద్ధతను తెలుస్తామని చెప్పింది. ఈ విషయం తెలిసిందే. అయితే గురువారం ఈ పిల్స్ మరోసారి విచారణకు వచ్చాయి.

ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమ సలహాదారు ఎన్. చంద్రశేఖర్ రెడ్డి తరఫున సీనియర్ న్యాయవాది హేమేంద్రనాథ్ రెడ్డి వాదించారు. ఆయన కోర్టులో మాట్లాడుతూ తమకు కోర్టు పంపిన నోటీసులు అందలేదని తెలిపారు. సలహాదారుగా జ్వాలాపురపు శ్రీకాంత్ నియామకాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిల్ తో పాటు చంద్రశేఖర్ నియామకంపై దాఖలైన పిల్ కూడా కలిసిందని మీడియా ద్వారా తమకు తెలిసిందన్నారు. అలా తెలుసుకొని తాము విచారణకు హాజరయ్యామని న్యాయస్థానానికి తెలిపారు.

దీనిమీద ధర్మాసనం మండిపడింది.  న్యాయవాది అయి ఉండి మీడియాలో చూసి కోర్టుకు హాజరు కావడం ఏమిటని ప్రశ్నించింది. న్యాయవాది అయినప్పుడు కేసుల జాబితాను చూసుకోవాలి కదా అని వ్యాఖ్యానించింది. కోర్టు నోటీసులు పంపించిందని…అవి ఎందుకు అందలేదని ప్రశ్నించింది. అలా చేయకుండా మీడియా ద్వారా తెలుసుకుని వచ్చాము అని.. కోర్టుకు సంబంధంలేని వివరాలను చెప్పడం ఏమిటని నిలదీసింది. ఇక హేమేంద్రనాథ్ రెడ్డి మాట్లాడుతూ.. ఈ పిల్ రాజకీయప్రేరణతో దాఖలు చేసిందని  ఆరోపించారు. దీనిమీద హైకోర్టు మండిపడింది. ఎలాంటి వ్యాజ్యాలను.. ఎలా డీల్ చేయాలో తమకు తెలుసునని హైకోర్టు న్యాయమూర్తి హెచ్చరించారు. 

ఆ తర్వాత ఏపీ బ్రాహ్మణ సేవా సంఘాల సమాఖ్య అధికార ప్రతినిధి రాజశేఖర్ రావు తరఫున సీనియర్ న్యాయవాది వేదుల వెంకటరమణ వాదనలు వినిపించారు. ఈ వ్యాజ్యంపై ఏజీ సమయం కోరే విషయంపై అభ్యంతరం తెలిపారు.  న్యాయస్థానం వాయిదాల వ్యవహారం మీద నిర్ణయం తీసుకోవాలన్నారు. అయితే, దీనికి ఏజీ స్పందిస్తూ తను తరచుగా వాయిదాలు తీసుకోనని చెప్పుకొచ్చారు. ప్రభుత్వ పరిపాలనలో సలహాదారుల జోక్యం ఉండదని కూడా స్పష్టం చేశారు.

సలహాదారుల నియామకానికి సంబంధించి మరికొన్ని వివరాలను సేకరించి కోర్టు ముందు ఉంచేందుకే తాను మరికొంత సమయం కావాలని కోరినట్లుగా ఏజీ కోర్టుకు తెలిపారు. దీనిని పరిగణలోకి తీసుకున్న ధర్మాసనం విచారణను ఫిబ్రవరి 2వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. దేవాదాయ శాఖ సలహాదారుగా జ్వాలాపురపు శ్రీకాంత్  కొనసాగడానికి వీలుగా గతంలో ఇచ్చిన మద్యంతర ఉత్తర్వులను ధర్మసనం పొడిగించింది.

click me!