ఇన్నర్ రింగ్ రోడ్ కేసు: లోకేష్ ఈ నెల 10న సీఐడీ ముందు హాజరుకావాలి.. స్పష్టం చేసిన హైకోర్టు..

By Sumanth KanukulaFirst Published Oct 3, 2023, 3:29 PM IST
Highlights

అమరావతి ఇన్నర్ రిండ్ రోడ్ కేసులో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ విచారణకు హాజరుకావాల్సిందేనని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు స్పష్టం చేసింది.

అమరావతి ఇన్నర్ రిండ్ రోడ్ కేసులో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ విచారణకు హాజరుకావాల్సిందేనని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు స్పష్టం చేసింది. ఈ నెల 10వ తేదీన సీఐడీ అధికారుల ఎదుట లోకేష్ విచారణకు హాజరు కావాలని తెలిపింది. వివరాలు.. ఇన్నర్ రింగ్ రోడ్ కేసుకు సంబంధించి సీఐడీ ఇచ్చిన 41 ఏ నోటీసులో నిబంధనలు లోకేష్ హైకోర్టులో సవాల్ చేశారు. లోకేష్ దాఖలు చేసిన లంచ్ మోషన్ పిటిషన్‌పై హైకోర్టు విచారణ చేపట్టింది. విచారణ సందర్భంగా.. లోకేష్ ప్రస్తుతం హెరిటేజ్‌లో షేర్ హోల్డర్ అని చెప్పిన ఆయన తరపు న్యాయవాదులు చెప్పారు. ఆయనకు తీర్మానాలు, బ్యాంక్ అకౌంట్ పుస్తకాలు ఇవ్వాలంటే కంపెనీ ప్రొసీజర్ ఉంటుందని తెలిపారు. లోకేష్‌ను ఆ వివరాలు సమంజసం కాదని వాదనలు వినిపించారు. 

అయితే తాము డాక్యుమెంట్లపై ఒత్తిడి చేయబోమని.. లోకేష్ రేపే విచారణకు హాజరు కావాలని సీఐడీ తరఫు న్యాయవాదులు కోరారు. అయితే అంత తొందర ఏముందని లోకేష్ తరపు న్యాయవాది పోసాని వెంకటేశ్వర్లు అడిగారు. అయితే ఇరుపక్షాల వాదనల అనంతరం.. లోకేష్ ఈ నెల 10వ తేదీన విచారణకు హాజరు కావాలని హైకోర్టు ఆదేశాలు జారీ  చేసింది. 10వ తేదీ ఉదయం 10 గంటల నుంచి 5 గంటలకు లోకేష్ విచారణకు హాజరుకావాలని.. అయితే న్యాయవాది సమక్షంలోనే విచారించాలని హైకోర్టు తెలిపింది. మధ్యాహ్నం గంట పాటు లంచ్ బ్రేక్ ఇవ్వాలని సీఐడీకి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. 

Latest Videos

ఇక, ఇక, అమరావతి రాజధాని ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు అలైన్‌మెంట్‌లో అవకతవకలు జరిగాయని ఏపీ సీఐడీ ఆరోపిస్తుంది. ఈ కేసు విషయాని వస్తే.. టీడీపీ నేతల ఆధీనంలో ఉన్న భూముల విలువను పెంచేందుకే అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు అసలు డిజైన్‌ను మార్చారని వైసీపీ ప్రభుత్వం పేర్కొంది. ఇందుకు సంబంధించి గతేడాది ఏప్రిల్‌లో ఐపీసీ, అవినీతి నిరోధక చట్టంలోని పలు సెక్షన్ల కింద సీఐడీ కేసు నమోదు చేసింది. చంద్రబాబు నాయుడు, నారాయణ, లింగమనేని రమేష్, లింగమనేని వెంకట సూర్య రాజశేఖర్, ఆర్కే హౌసింగ్ లిమిటెడ్‌కు చెందిన కేపీవీ అంజనీ కుమార్, రామకృష్ణ హౌసింగ్, హెరిటేజ్ ఫుడ్స్ తదితరుల పేర్లను ఎఫ్‌ఐఆర్‌లో చేర్చారు.

ఈ కేసులో నారా లోకేష్‌ను ఏ14గా పేర్కొంటూ విజయవాడలోని అవినీతి నిరోధక శాఖ కోర్టులో సెప్టెంబర్‌ 26న ఏపీ  సీఐడీ మెమో దాఖలు చేసింది. ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్‌మెంట్‌లో కొంత మందికి లబ్ధి చేకూరేలా మార్పులు చేయడంలో లోకేష్ కీలక పాత్ర పోషించారని సీఐడీ ఆరోపించింది. అమరావతి రాజధాని ప్రాంతంలో పారిశ్రామికవేత్త లింగమనేని రమేశ్‌ కుటుంబానికి లోకేష్ సాయం చేశారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసులో లింగమనేని రమేష్‌ ఏ3గా ఉన్నారు. ఈ క్రమంలోనే ఈ నెల 4వ తేదీన విచారణకు రావాలని లోకేష్‌కు సీఐడీ అధికారులు నోటీసులు అందజేశారు. అయితే సీఐడీ నోటీసులోని నిబంధనలపై లోకేష్ హైకోర్టును ఆశ్రయించారు. 

click me!