ఆనందయ్య మందు: జగన్ ప్రభుత్వాన్ని ప్రశ్నించిన ఏపీ హైకోర్టు

By telugu teamFirst Published May 31, 2021, 12:06 PM IST
Highlights

తన మందు పంపిణీకి అనుమతి ఇవ్వాలని కోరుతూ నెల్లూరు జిల్లా కృష్ణపట్నం గ్రామానికి చెందిన బొనిగె ఆనందయ్య దాఖలు చేసిన పిటిషన్ మీద ఏపీ హైకోర్టు విచారణ చేపట్టింది. ప్రభుత్వ ఉత్తర్వులపై హైకోర్టు ప్రశ్నించింది.

అమరావతి: నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలో బొనిగె ఆనందయ్య మందుపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఆనందయ్య మందుపై ప్రభుత్వం ఎటువంటి ఉత్తర్వులు జారీ చేసిందని అడిగింది. నాలుగు రోజుల సమయం ఇచ్చినా ఎందుకు తమ ముందు ప్రభుత్వ ఉత్తర్వులను పెట్టలేకపోయారని ప్రశ్నించింది.

ఆనందయ్య కరోనా మందు పంపిణీపై ఎందుకు తాత్సారం చేస్తున్నారని హైకోర్టు ప్రశ్నించింది. సిగరెట్లు, మద్యం హానికరమని తెలిసినా అభ్యంతరం చెప్పని ప్రభుత్వం ఇప్పుడు ఆనందయ్య మందుకు ఎందుకు అభ్యంతరం చెబుతుందో సమాధానం చెప్పాలని పిటిషన్ తరఫు న్యాయవాది యలమంజుల బాలాజీ అడిగారు.

ఆనందయ్య మందుపై తిరిగి హైకోర్టులో విచారణ ప్రారంభమై మళ్లీ సాయంత్రం 3 గంటలకు వాయిదా పడింది. ఆనందయ్య మందుపై ప్రభుత్వం సమీక్ష జరుపుతోందని ప్రభుత్వం తరఫు న్యాయవాది చెప్పారు. ప్రభుత్వం చెప్పిన అభ్యంతరాలను హైకోర్టు తోసి పుచ్చింది.. సమీక్షలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం తర్వాత తీర్పు వెలువరిస్తామని హైకోర్టు చెప్పింది. 

ఆనందయ్య మందుపై ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల వివరాలను తమ మందు ఉంచాలని హైకోర్టు ఆదేశించింది. విచారణను హైకోర్టు 15 నిమిషాల పాటు వాయిదా వేసింది. తన మందు పంపిణీకి అనుమతి ఇవ్వాలని కోరుతూ ఆనందయ్య పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ మీద హైకోర్టు విచారణ చేపట్టింది. 

కృష్ణపట్నంలో ఆనందయ్య మందు పంపిణీని ప్రభుత్వం ఆపేసిన విషయం తెలిసిందే. ఆనందయ్యను పోలీసులు రహస్య ప్రదేశానికి తరలించారు. ఆనందయ్య ప్రస్తుతం కృష్ణపట్నం గోపాలపురంలోని కేపీఎన్ఎస్పీఎల్ అకాడమీలో ఉన్నారు. తీవ్రమైన మనోవేదనకు గురవుతున్నట్లు చెబుతున్నారు.

ఆనందయ్య మందు పంపిణీకి అనుమతి ఇవ్వాలని కోరుతూ మరో రెండు పిటిషన్లు కూడా హైకోర్టులో దాఖలయ్యాయి. కాగా, ఆనందయ్య మందు తీసుకున్న రిటైర్డ్ హెడ్ మాస్టర్ కోటయ్య సోమవారం నెల్లూరు జిజీహెచ్ లో మరణించారు. 

click me!