మాజీ మంత్రి నారాయణకు హైకోర్టులో ఊరట.. చిత్తూరు సెషన్స్ కోర్టుకు కీలక ఆదేశాలు

By Sumanth KanukulaFirst Published Dec 6, 2022, 4:30 PM IST
Highlights

ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి నారాయణకు హైకోర్టులో ఊరట లభించింది. చిత్తూరు తొమ్మిదో అదనపు సెషన్స్‌ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేసింది.

ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి నారాయణకు హైకోర్టులో ఊరట లభించింది. పదో తరగతి పరీక్ష పేపర్ లీక్ కేసులో చిత్తూరు సెషన్స్ కోర్టు బెయిల్‌ రద్దు ఉత్తర్వులపై నారాయణ హైకోర్టును ఆశ్రయించారు. నారాయణ పిటిషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు.. చిత్తూరు తొమ్మిదో అదనపు సెషన్స్‌ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేసింది. మళ్లీ విచారించి నాలుగు వారాల్లో నిర్ణయం తీసుకోవాలని సెషన్స్ కోర్టుకు ఆదేశాలు జారీచేసింది. 

ఇక, పదో తరగతి పరీక్ష పేపర్ లీక్ కేసులో నారాయణకు చిత్తూరు మేజిస్ట్రేట్ కోర్టు ఇచ్చిన బెయిల్‌ను సెషన్స్ కోర్టు రద్దు చేసింది. నవంబర్ 30లోపు నారాయణ ట్రయల్ కోర్టు ముందు లొంగిపోవాలని పేర్కొంది. దీనిని సవాల్ చేస్తూ నారాయణ హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై విచారణ సందర్భంగా నారాయణ తరపు లాయర్ వాదనలు వినిపిస్తూ.. అర్నేష్ కుమార్ కేసులో అత్యున్నత న్యాయస్థానం మార్గదర్శకాలను దాటవేసి.. ఏడేళ్లకు పైగా జైలు శిక్ష పడేందుకే పోలీసులు ఈ కేసులో ఐపీసీ సెక్షన్ 409ని చేర్చారని అన్నారు. ఐపీసీలోని సెక్షన్ 409 ప్రభుత్వోద్యోగి నమ్మకాన్ని ఉల్లంఘించిన నేరానికి శిక్షను నిర్వచిస్తుందని అన్నారు. 

ప్రాసిక్యూషన్‌ వాదనలు వినకుండానే బెయిల్‌ మంజూరు చేయడంతో మేజిస్ట్రేట్‌ ఇచ్చిన బెయిల్‌ను చిత్తూరు తొమ్మిదో అదనపు సెషన్స్‌ జడ్జి రద్దు చేశారని అన్నారు. ఆ రోజు పబ్లిక్ ప్రాసిక్యూటర్ కోర్టుకు హాజరు కాకపోవడంతో మేజిస్ట్రేట్ అన్ని వాస్తవాలను పరిగణనలోకి తీసుకున్నారని తెలిపారు. సెషన్స్ కోర్టు కూడా బెయిల్ మంజూరు చేయడంలో తప్పును కనుగొనలేదనీ.. విధానపరమైన లోపాల ఆధారంగా దానిని రద్దు చేసిందని వాదనలు వినిపించారు. నారాయణ ఎడ్యుకేషనల్ ట్రస్ట్‌కు నారాయణ 2014లో రాజీనామా చేశారని హైకోర్టుకు తెలిపారు. 

పోలీసుల తరఫున అదనపు అడ్వకేట్ జనరల్ వాదిస్తూ..  ఆరోపించిన నేరంలో పిటిషనర్ ప్రమేయాన్ని నిరూపించడానికి పోలీసులు ఆధారాలు సేకరించారని చెప్పారు. రిమాండ్ దశలో బెయిల్ మంజూరు చేయడం కుదరదని చెప్పారు. ఈ క్రమంలోనే గతవారం విచారణ సందర్భంగా ఇరుపక్షాల వాదనలు  విన్న హైకోర్టు తీర్పు వెలువడే వరకు సెషన్స్ కోర్టు ఉత్తర్వులపై స్టే విధించింది. అయితే తాజాగా ఈరోజు చిత్తూరు సెషన్స్ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను హైకోర్టు రద్దు చేసింది.

click me!