అధిక విద్యుత్ ఛార్జీల వసూళ్లు... ప్రభుత్వానికి హైకోర్టు కీలక ఆదేశాలు

By Arun Kumar PFirst Published May 21, 2020, 11:35 AM IST
Highlights

ప్రభుత్వం ప్రజల నుండి అధిక విద్యుత్ ఛార్జీలు వసూలు  చేస్తోందంటూ  దాఖలైన పిటిషన్ పై హైకోర్టులో  విచారణ జరిగింది.  

అమరావతి: లాక్ డౌన్ తో ఇప్పటికే పుట్టెడు కష్టాల్లో వున్న ప్రజల నుండి విద్యుత్ బిల్లులను అధికంగా వసూలు చేస్తోందంటూ ఏపి సర్కార్ విమర్శలు ఎదుర్కుంటోంది. ఈ విషయంలో ప్రభుత్వ తీరును తప్పుబడుతూ హైకోర్టులో ఓ పిటిషన్ దాఖలయ్యింది. దీనిపై ఇవాళ విచారణ జరిపిన హైకోర్టు 3 వారాల్లోగా కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. 

లాక్ డౌన్ ను కారణంగా చూపి రెండు నెలల బిల్లులు ఒకేసారి ఇవ్వడం నిబంధనలకు విరుద్ధమన్న పిటిషనర్ తరపు లాయర్ కోర్టుకు తెలిపారు. ఏబీసీ టారిఫ్ యూనిట్లలో మార్పులు చేశారని... అయితే కొత్త నిబంధనలు ఏప్రిల్1 నుంచి అమలు చేస్తున్నారని అన్నారు. 2 నెలల బిల్లులు ఒకేసారి ఇవ్వడంతో స్లాబు మారి బిల్లులు అధికంగా వచ్చాయంటూ పిటిషనర్ తరపు లాయర్ వాదించారు. 

విద్యుత్ ఛార్జీలు మూడు, నాలుగు  రెట్లు పెంచి ప్రజలపై మరింత భారం మోపుతున్న ప్రభుత్వ చర్యలకు నిరసనగా (నేడు) గురువారం టిడిపి నేతలు ఇళ్లలోనే నిరసన దీక్షలు చేపట్టాలని ఆ పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. కరోనా కష్టాలతో ప్రజలు తల్లడిల్లుతుంటే ఆదుకునే చర్యలు చేపట్టకుండా వైసిపి ప్రభుత్వం మరిన్ని కష్టాల్లోకి నెట్టేలా వ్యవహరిస్తోందని ఆయన ఆరోపించారు. గురువారం రాష్ర్ట వ్యాప్తంగా అన్ని మండలాలు, నియోజకవర్గాలలో  టిడిపి నాయకులు ఇళ్లలోనే ఉంటూ నిరసన దీక్షలు చేయాలని చంద్రబాబు సూచించారు.  

అయితే  ప్రభుత్వం మాత్రం తాము విద్యుత్ ఛార్జీలు పెంచలేదని... ప్రజల నుండి అధికంగా ఛార్జీలు వసూలు చేస్తున్నట్లు ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలన్ని అవాస్తమంటోంది. ఇలా అధికార ప్రతిపక్షాల మధ్య సాగుతున్న విద్యుత్ ఛార్జీల వివాదం తాజాగా హైకోర్టుకు చేరింది. 
 


 

click me!