హీరా గ్రూపు కుంభకోణం: రాజకీయ కుట్ర అంటున్న నౌహీరా షేక్‌

By Nagaraju TFirst Published Jan 3, 2019, 1:15 PM IST
Highlights

తనపై రాజకీయ కుట్ర జరిగిందని హీరా గ్రూపు కుంభకోణం కేసులో నిందితురాలైన హీరా గ్రూప్ అధినేత్రి నౌహీరా షేక్‌ కన్నీటి పర్యంతమయ్యారు. కేసు విచారణలో భాగంగా నౌహీరా షేక్ ను సిఐడీ పోలీసులు చిత్తూరు కోర్టులో హాజరుపరిచారు.  
 

చిత్తూరు: తనపై రాజకీయ కుట్ర జరిగిందని హీరా గ్రూపు కుంభకోణం కేసులో నిందితురాలైన హీరా గ్రూప్ అధినేత్రి నౌహీరా షేక్‌ కన్నీటి పర్యంతమయ్యారు. కేసు విచారణలో భాగంగా నౌహీరా షేక్ ను సిఐడీ పోలీసులు చిత్తూరు కోర్టులో హాజరుపరిచారు.  

తనపై రాజకీయ కుట్ర జరిగిందంటూ ఆమె మీడియాతో వాపోయారు. తాను కుంభకోణం చేశానంటూ వస్తున్న వార్తల్లో ఏమాత్రం వాస్తవం లేదన్నారు. జస్టిస్ ఫర్ హ్యుమానిటీ కోసం తాను రాజకీయ పార్టీ తన గళం విప్పినప్పటి నుంచి ఇలాంటి వేధింపులు ఎక్కువయ్యాయని తెలిపారు. గతంలో కూడా వ్యాపార పరంగా శత్రువులు ఉండేవారని వారికి రాజకీయం తోడైందన్నారు. 

బంగారు నగలపైనే ఎక్కువ శాతం లోన్లు ఇచ్చాం కాబట్టి డిపాజిట్ దార్లు ఎక్కడా నష్టపోరని తెలిపారు. సంస్థతో 15 ఏళ్లుగా అనుబంధంగా ఉంటూ డిపాజిట్ దార్లు 
లబ్ధి పొందారని గుర్తు చేశారు. 

 తనను కావాలనే కేసులో ఇరికిచ్చారని ఏం జరుగుతుందో తనకు తెలియడం లేదని ఆమె వాపోయారు. తన సంస్థకు చెందిన సభ్యులు ఎవరూ నష్టపోరని ధీమా వ్యక్తం చేశారు. 15ఏళ్లుగా కస్టమర్స్ కు అంతా సవ్యంగానే అందజేశామని అయితే జీఎస్టీ ఫలితంగా ఈసారి కాస్త పేమెంట్లు ఆలస్యం అయ్యాయని దాన్ని ఆసరాగా తీసుకుని తనపై ఇలా కేసులు వేశారని ఆమె ఆరోపించారు. 

తాను ఎప్పుడూ తప్పు చెయ్యలేదని త్వరలోనే తాను నిర్దోషిగా బయటకు వస్తానని ధీమా వ్యక్తం చేశారు. తనను రిమాండ్ లోకి తీసుకుని విచారిస్తున్నా ఇప్పటికీ లక్ష రూపాయలు వరకు స్కామ్ అనేది కనిపెట్టలేకపోయారన్నారు. లీగల్ గా బిజినెస్ చేశానని తాను భయపడాల్సిన అవసరం లేదన్నారు. ప్రస్తుతం ఇప్పుడు నా చేతులు కాళ్లు కట్టేసి  డబ్బులు ఇవ్వమంటే ఎలా ఇస్తామంటూ ప్రశ్నించారు. 

తాను ఎక్కడికి పారిపోలేదని లీగల్ గా వ్యాపారం చేసుకుంటున్న తనను అక్రమంగా అరెస్ట్ చేసి తన అకౌంట్లు ఫీజ్ చేసి ఇప్పుడు డబ్బులు ఇవ్వమంటే ఎలా ఇస్తామన్నారు. దయచేసి కస్టమర్స్ ఎవరూ ఆందోళన పడొద్దని వారికి ఎలాంటి అన్యాయం జరగదని నౌహీరా భరోసా ఇచ్చారు. 
 
నౌహీరా గొలుసుకట్టు వ్యాపారం పేరుతో దేశ వ్యాప్తంగా డిపాజిట్లు సేకరించి కోట్ల రూపాయలు ఆమె స్వాహా చేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో నౌహీరాను సిఐడీ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. హీరా గ్రూపులో ఉగ్రవాదుల డిపాజిట్లు సైతం ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. 

విచారణకు సీఐడీ పోలీసులు జాతీయ దర్యాప్తు సంస్థల సహకారం కోరినట్లు తెలుస్తోంది. ఎనిమిది విదేశీ బ్యాంకు ఖాతాల్లో రూ.వందల కోట్ల లావాదేవీలు జరిపినట్లు ఆరోపణలున్నాయి. హీరా గ్రూపు కుంభకోణం విలువ దాదాపు రూ.8 వేల కోట్లకు పైగా ఉన్నట్లుగా పోలీసులు విచారణలో తేల్చారు. మరోవైపు హీరా గ్రూపు ఫెమా నిబంధనలు కూడా ఉల్లంఘించి, నిధులను అక్రమంగా తరలించినట్లు సీసీఎస్ పోలీసులు చెప్తున్నారు. 

click me!