AP Weather: ఏపీలో మరో మూడు రోజుల పాటు పిడుగులతో వానలే..వానలు!

Published : May 06, 2025, 07:13 AM ISTUpdated : May 06, 2025, 07:37 AM IST
AP Weather: ఏపీలో మరో మూడు రోజుల పాటు పిడుగులతో వానలే..వానలు!

సారాంశం

ఏపీలో వాతావరణం ఒక్కసారిగా తారుమారైంది.మరో మూడు రోజుల పాటు వాతావరణం ఇలానే ఉంటుందని అధికారులు పేర్కొన్నారు.మరికొన్ని చోట్ల పిడుగులతో వర్షాలు పడే అవకాశాలున్నాయి.

ఆంధ్రప్రదేశ్‌లో వాతావరణం ఒక్కసారిగా తారుమారైంది. పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో భారీ వర్షాలు కురవడంతో జనజీవితం అస్తవ్యస్తమైపోయింది. వర్షాల వెంట వచ్చిన ఈదురుగాలులతో కొన్ని చోట్ల పెద్ద పెద్ద చెట్లు నేలకూలాయి. రహదారులపై నీరు నిలిచిపోవడం, ట్రాఫిక్‌కు అంతరాయం కలగడం వంటివి చోటుచేసుకున్నాయి. ముఖ్యంగా అల్లూరి, విశాఖపట్నం, తూర్పు, పశ్చిమ గోదావరి, ఏలూరు, గుంటూరు, ప్రకాశం, బాపట్ల జిల్లాల్లో వర్షాలు తీవ్రమయ్యాయి. కొన్ని ప్రాంతాలు జలమయమవ్వడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

కోనసీమ జిల్లాలో అమలాపురం, మామిడికుదురు, పి.గన్నవరం ప్రాంతాల్లో మేఘగర్జనలతో కూడిన వర్షం కురిసింది. కొబ్బరి రైతులు ఈ వర్షాన్ని ఆశగా చూస్తున్నప్పటికీ, వరి రైతులకు ఇది కొత్త సమస్యలకి తెరలేపింది. కోతకోసి ఆరబెట్టిన ధాన్యం తడిచిపోవడంతో వారు పట్టలు కప్పి పంటను రక్షించేందుకు ప్రయత్నిస్తున్నారు.

కృష్ణా జిల్లా పెనమలూరులో భారీ గాలులతో వర్షం కురవడం వల్ల విద్యుత్ తీగలు తెగిపోవడమే కాక, కొన్ని చోట్ల చెట్లు రోడ్డుపై పడిపోయాయి. కంకిపాడు ప్రధాన రహదారిపై చెట్టు కూలిపోవడంతో వాహనాలు నిలిచిపోయాయి. విజయవాడలో కూడ వర్షం విరివిగా పడింది. నగరంలో నీరు నిలిచిపోయి ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది. వేసవి వేడిని భరించలేకపోతున్న స్థానికులకు మాత్రం ఇది తాత్కాలిక ఊరటను ఇచ్చింది.

రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ తెలిపిన వివరాల ప్రకారం, వాతావరణం ఇంకా మూడు రోజులు ఇలా భిన్నంగా మారుతూ ఉంటుందట. కొన్ని ప్రాంతాల్లో ఎండలు ఉంటే, మరికొన్నిచోట్ల మళ్ళీ పిడుగులతో వర్షాలు పడే అవకాశం ఉంది. శ్రీకాకుళం నుంచి తిరుపతి వరకు పలు జిల్లాల్లో సోమ, మంగళవారాల్లో తేలికపాటి వర్షాలు పడొచ్చని అంచనా. మరోవైపు రెండు రోజుల్లో ఉష్ణోగ్రతలు 43 డిగ్రీల వరకు చేరే అవకాశముందని అధికారులు హెచ్చరిస్తున్నారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Cold Wave Alert : తెలంగాణపై చలి పంజా.. ఈ జిల్లాల్లో వచ్చే పదిరోజులు అత్యల్ప ఉష్ణోగ్రతలు
Scrub Typhus : తెలుగు రాష్ట్రాల్లో కొత్త వ్యాధి.. ఏమిటిది, ఎలా సోకుతుంది, లక్షణాలేంటి?