
అమరావతి : నడి వేసవి మండుటెండల సమయంలో విచిత్రంగా తెలుగురాష్ట్రాలను వర్షాలు ముంచెత్తుతున్నాయి. గత కొద్దిరోజులుగా తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ లో ఈదురుగాలులు, ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాలు ఇంకొన్ని రోజులు ఇలాగే కొనసాగే అవకాశాలున్నాయని వాతావరణ విభాగం హెచ్చరిస్తోంది. ఇవాళ(మంగళవారం) కూడా ఆంధ్ర ప్రదేశ్ లో భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయన్న హెచ్చరికల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా వుండాలని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ అప్రమత్తమయ్యింది.
విదర్భ నుండి ఉత్తర తమిళనాడు వరకు తెలంగాణ, కర్ణాటక మీదుగా ద్రోణి కొనసాగుతోందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో అటు తెలంగాణతో పాటు ఏపీలోనూ వర్షాలు కురుస్తాయని హెచ్చరించారు. ఈ రెండ్రోజులు అక్కడక్కడ భారీ వర్షాలు, మరికొన్నిచోట్ల మోస్తరు వర్షాలు కురవనున్నాయని... పిడుగులు కూడా పడవచ్చని తెలిపారు. కాబట్టి వ్యవసాయ పనులకు వెళ్ళే రైతులు, కూలీలు, పశువులు, గొర్రెల కాపరులు చెట్ల కింద ఉండరాదని ఏపీ విపత్తుల సంస్థ ఎండి బిఆర్ అంబేద్కర్ హెచ్చరించారు.
ఇవాళ (సోమవారం) కోనసీమ, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా, పల్నాడు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య జిల్లాల్లో పలుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని ప్రకటించారు. రాయలసీమ ప్రాంతంలోని వైఎస్‌ఆర్,సత్యసాయి, అనంతపురం, కర్నూలు, నంద్యాల జిల్లాల్లోనూ వర్షాలు కురుస్తాయని వెల్లడించారు. ఇక రాష్ట్రంలోని పలుప్రాంతాల్లో తేలికపాటి జల్లులు, మోస్తరు వర్షాలు కురిసే అవకాశం వుందని హెచ్చరించారు.
Read More అంతర్వేదిలో కిలోమీటర్ వెనక్కి వెళ్లిన సముద్రం.. స్థానికుల్లో టెన్షన్
ఇదిలావుంటే తెలంగాణలో మరీముఖ్యంగా హైదరాబాద్ లో వర్షాలు దంచి కొడుతున్నాయి. గత రెండ్రోజులుగా హైదరాబాద్ లో కురిసిన కుండపోత వర్షం భీభత్సం సృష్టించారు. పలు లోతట్టు ప్రాంతాల్లో వరద నీటి ప్రవాహానికి ఇళ్లముందు నిలిపిన ద్విచక్రవాహనాలు కొట్టుకుపోయాయంటే వర్షం ఏ స్థాయిలో కురిసిందో అర్థంచేసుకోవచ్చు. అయితే ఇంతటితో వర్షాలు ఆగడం లేదని... మరికొన్నిరోజులు కొనసాగే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ ప్రకటించింది.
తెలంగాణలోనూ ద్రోణి ప్రభావంతో తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయని... ఈ మూడ్రోజులు ఇదే పరిస్థితి వుంటుందని పేర్కొన్నారు. భారీ వర్షాలు కురిసే అవకాశాలున్న హైదరాబాద్‌తో పాటు పలు జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీచేసింది. పలుచోట్ల ఈదురుగాలులు, పిడుగులు, వడగళ్లతో కూడిన వర్షం పడుతుందని హెచ్చరించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.