Heavy rains: ఏపీలో భారీ వర్షాలు.. నెల్లూరు జిల్లాల్లో పాఠశాలలకు సెలవు, కంట్రోల్‌ రూమ్ ఏర్పాటు..

By team telugu  |  First Published Nov 11, 2021, 11:38 AM IST

నైరుతి బంగాళాఖాతంలో కొనసాగుతున్న వాయుగుండం ప్రభావంతో ఏపీలో భారీ వర్షాలు (Heavy rains) కురుస్తున్నాయి. ముఖ్యంగా నెల్లూరు (nellore), చిత్తూరు (Chittoor) జిల్లాలపై ఈ ప్రభావం ఎక్కువగా ఉంది. వర్ష బీభత్సవం నేపథ్యంలో నెల్లూరు జిల్లాలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. 


ఆగ్నేయ బంగాళాఖాతంలో మంగళవారం ఏర్పడిన అల్పపీడనం బుధవారం సాయంత్రానికి వాయుగుండంగా మారింది. ఈ ప్రభావంతో తమిళనాడుతో పాటుగా, ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. నైరుతి బంగాళాఖాతంలో కొనసాగుతున్న వాయుగుండం..  చెన్నైకి ఆగ్నేయంగా 300 కిలోమీటర్లు, పుదుచ్చేరికి ఆగ్నేయంగా 280 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది. ఇది పశ్చిమ వాయవ్య దిశగా ప్రయాణించి గురువారం సాయంత్రం తమిళనాడులోని కారైకల్, ఏపీలోని శ్రీహరికోట మధ్య కడలూరు సమీపంలో తుపానుగా తీరం దాటే అవకాశం ఉన్నట్లు వాతావరణ కేంద్రం తెలిపింది. ఆ సమయంలో గంటకు 60 నుంచి 70 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని భారత వాతావరణశాఖ తెలిపింది.

ఈ ప్రభావంతో గురువారం నెల్లూరు, ప్రకాశం, చిత్తూరు, కడప జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు (Heavy rains) కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. కృష్ణ, ఉభయ గోదావరి జిల్లాలు, విశాఖలో కూడా భారీ వర్షాలు కురుస్తాయని చెప్పారు. ఇక, బుధవారం నుంచే ఏపీలో పలుచోట్ల ఇప్పటికే భారీ వర్షాలు కురుస్తున్నాయి. నెల్లూరు (nellore), చిత్తూరు (Chittoor) జిల్లాలో ఇప్పటికే వర్ష బీభత్సం కొనసాగుతుంది. పంబలేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. స్వర్ణముఖి బ్యారేజ్‌కి భారీగా వరదనీరు చేరడంతో.. అధికారులు రెండు గేట్లను ఎత్తి 600 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. 

Latest Videos

undefined

భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తమైన అధికారులు లోతట్టు ప్రాంతాల ప్రజలను అలర్ట్ చేస్తున్నారు. మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లవద్దని అధికారులు హెచ్చరించారు. నెల్లూరు జిల్లాలో వర్షాలు దంచి కొడుతుండటంతో జిల్లా కలెక్టర్ చక్రధర్‌ బాబు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. అప్రమత్తంగా ఉండాలని అధికారులను ఆదేశించారు. లోతట్టు ప్రాంత ప్రజలను సురక్షిత పునరావాస కేంద్రాలకు తరలించేలా చర్యలు చేపట్టాలన్నారు. ఇక, 13 ఏళ్ల తర్వాత నెల్లూరుకు సమీపంలో తుపాను తీరం దాటనుంది. 

ఈ క్రమంలోనే నెల్లూరులోని.. ఎమ్మార్వో, ఆర్డీవో కార్యాలయాల్లో కాల్ సెంటర్ లు ఏర్పాటు చేశారు. ప్రజలు సాయం కోసం కంట్రోల్ రూమ్ నెంబర్ 1077 ‌కు ఫోన్ చేయాలని సూచించారు. భారీ వర్షాల నేపథ్యంలో జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు జిల్లా కలెక్టర్ సెలవు ప్రకటించారు. గాలుల వేగం పెరగడంతో చలి తీవ్రత కూడా పెరగుతోంది.

48 గంటలు భారీ వర్షాలు..
ఇక, విశాఖ, గంగవరం, కాకినాడ, మచిలీపట్నం, నిజాంపట్నం, కృష్ణపట్నం పోర్టులకు ఒకటో నంబర్‌ ప్రమాద హెచ్చరిక, కళింగపట్నం, భీమునిపట్నం, వాడరేవుల్లో అప్రమత్తత హెచ్చరికలు జారీచేశారు. రానున్న 48గంటల రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. నెల్లూరు. చిత్తూరు, ప్రకాశం, కడప జిల్లాలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని పేర్కొంది.

మరో అల్పపీడనం..
దక్షిణ అండమాన్‌ సముద్రంలో ఈ నెల 13న మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. అది పశ్చిమ వాయవ్య దిశగా ప్రయాణించి ఏర్పడిన 48 గంటల్లో మరింత బలపడే అవకాశం ఉన్నట్లు పేర్కొంది.

click me!