
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జూన్ 1వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రేషన్ షాపుల ద్వారా బియ్యం సహా ఇతర నిత్యావసరాలను పంపిణీ చేయబోతోంది. ఇప్పటివరకు ఇంటింటికీ వెళ్లే మొబైల్ వాహనాల ద్వారా సరుకులు అందజేస్తున్న విధానాన్ని తొలగిస్తూ, మళ్లీ షాపుల ద్వారా సరఫరా చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.ఈ నేపథ్యంలో మాజీ ఎంపీ చేగొండి హరిరామజోగయ్య ఒక కీలకమైన సూచన చేశారు. రేషన్ బదులుగా నెలకు ఒక్కో కుటుంబానికి రూ.2 వేలు నగదు అందిస్తే ప్రజలకు మరింత ప్రయోజనం ఉంటుందని అభిప్రాయపడ్డారు. ఈ మేరకు ఆయన ప్రభుత్వం దృష్టికి లేఖ ద్వారా వివరాలు తీసుకెళ్లారు.
ఆ లేఖలో ఆయన పేర్కొన్న అంశాల ప్రకారం, నిరుపేదలకు కావలసిన నాణ్యమైన ఆహారాన్ని అందించాలంటే ప్రభుత్వం నేరుగా నగదు ఇవ్వడమే మంచిదని అభిప్రాయపడ్డారు. ప్రత్యేకంగా మహిళా యజమాని పేరుతో డబ్బులు జమ చేస్తే, వారు తమకు అవసరమైన నిత్యావసరాలను స్వతంత్రంగా కొనుగోలు చేసుకునే వీలుంటుందన్నారు.
ఎన్టీఆర్ కాలంలో ప్రారంభమైన రేషన్ పథకం ఏ రూపంలో ఉన్నా, లక్ష్యం మాత్రం నిరుపేదల ఆకలిని తీర్చడమేనని ఆయన గుర్తు చేశారు. అయితే ఇప్పటికీ పంపిణీ అవుతున్న ముతక బియ్యం నాణ్యత విషయంలో విమర్శలు వినిపిస్తున్నాయని తెలిపారు. చాలామంది ప్రజలు ఆ బియ్యాన్ని వినియోగించకుండా బజారులో అమ్ముతున్నారని, ఇది అసలు లక్ష్యాన్ని మరిచిపోతున్నదని హరిరామజోగయ్య అభిప్రాయపడ్డారు.
రేషన్ షాపుల ద్వారా సరుకుల పంపిణీ మళ్లీ ప్రారంభించడం వల్ల అవినీతి నిరోధించగలమని, ప్రభుత్వ ఖర్చులను తగ్గించగలమని ప్రభుత్వం చెబుతున్నా, ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకొని నగదు ఇవ్వడం ద్వారా మెరుగైన సంక్షేమాన్ని అందించవచ్చని ఆయన పేర్కొన్నారు.పక్క రాష్ట్రాల్లో అమలవుతోన్న సన్న బియ్యం పథకాన్ని కూడా పరిశీలించాలని సూచిస్తూ, కేవలం బియ్యం, పప్పు, పంచదార కాకుండా నూనె, కూరగాయలు, ఉల్లిపాయలు, పాలు వంటి వస్తువులు కూడా అందుబాటులోకి తెస్తే ప్రజలు సంతృప్తిగా ఉండగలరని హరిరామజోగయ్య అభిప్రాయపడ్డారు.
మొత్తానికి, రేషన్ పథకాన్ని మెరుగుపరిచే మార్గంగా నగదు మోడ్‌ను పరిశీలించాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు.