మద్యం అమ్మకాలకు అనుమతి ఇవ్వడంపై కేంద్ర ప్రభుత్వాన్ని తప్పు పట్టడాన్ని బిజెపి ఎంపీ జీవీఎల్ నరసింహారావు తప్పు పట్టారు. ఏపీలో మద్యం అమ్మకాలను విస్తృతం చేసింది చంద్రబాబేనని నిందించారు.
న్యూఢిల్లీ: మద్యం అమ్మకాలకు రాష్ట్రాలు అనుమతి ఇవ్వడంపై కేంద్ర ప్రభుత్వం మీద వస్తున్న విమర్శలను బిజెపి రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు తిప్పికొట్టారు. మద్యం ధరల పెంపుపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు ఆయన చురకలు అంటించారు.
మద్యం ధరలు 75 శాతం పెంచాలని కేంద్రం చెప్పిందా అని ఆయన అడిగారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మద్యం ధరలను 75 శాతం పెంచిన విషయం తెలిసిందే. మద్యం అమ్మకాల అనుమతిని కేంద్ర ప్రభుత్వానికి ఆపాదించడం దురదృష్టకరమని ఆయన అన్నారు.
మద్యం అమ్మకాలకు అనుమతి ఇవ్వాలని రాష్ట్రాలు కేంద్రంపై ఒత్తిడి తెచ్చాయని ఆయన న్నారు. అయిష్టంగానే నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు వదిలేసిందని ఆయన చెప్పారు. మద్యం అమ్మకాలపై వచ్చే ఆదాయమంతా రాష్ట్రాలకు చెందుతుందని జీవీఎల్ చెప్పారు.
undefined
మద్యం అమ్మకాలను ఆంధ్రప్రదేశ్ లో విస్తృతం చేసింది టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడేనని జీవీఎల్ అన్నారు. 2003లో 3 వేల కోట్ల రూపాయలు ఉన్న ఆబ్కారీ ఆదాయాన్ని 6 వేల కోట్ల రూపాయలకు పెంచింది చంద్రబాబేనని ఆయన అన్నారు. వైసీపీ, టీడీపీ అవకాశవాద రాజకీయాలను సాగిస్తున్నాయని ఆయన అన్నారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికే మద్యం అమ్మకాలకు అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. తెలంగాణలో ఈ రోజు నుంచి మద్యం అమ్మకాలు ప్రారంభమయ్యాయి. కొన్ని ఇతర రాష్ట్రాల్లో కూడా మద్యం అమ్మకాలకు ప్రభుత్వాలు అనుమతి ఇచ్చాయి.