
ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలకు మరో ఏడాది సమయం ఉండగానే పొత్తుల అంశం హాట్ టాపిక్‌గా మారింది. ఇటీవల జనసేన అధినేత పవన్ కల్యాణ్ పొత్తులు ఉంటాయని స్పష్టమైన ప్రకటన చేశారు. అయితే పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై స్పందిస్తున్న ఏపీ బీజేపీ నేతలు.. ఆ విషయం పార్టీ అధిష్టానం చూసుకుంటుందని చెబుతున్నారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన, తెలుగుదేశంతో తమ పార్టీ పొత్తుకు సంబంధించి పవన్ కల్యాణ్ చేసిన ప్రతిపాదనను కేంద్ర బీజేపీ నాయకత్వ పరిశీలనకు పంపినట్లు బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు తెలిపారు.
ప్రస్తుతం తాము జనసేనతో పొత్తులో ఉన్నామని జీవీఎల్ తెలిపారు. జగన్‌ను గద్దె దించేందుకు ప్రభుత్వ వ్యతిరేక ఓట్ల చీలినివ్వకూడదని పవన్ కల్యాణ్ ప్రతిపాదించారని ఆయన అన్నారు. అయితే పవన్ ప్రతిపాదనపై బీజేపీ అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. రాష్ట్ర స్థాయిలో ఇందుకు సంబంధించి ఎటువంటి చర్చలు జరగలేదని స్పష్టం చేశారు.
విశాఖపట్నం తూర్పు, గాజువాక నియోజకవర్గాల్లో వైసీపీ ప్రభుత్వంపై బీజేపీ చార్జిషీట్‌ల తయారీ ప్రారంభించిందని చెప్పారు. మే 19 నాటికి చార్జిషీట్‌లు సిద్ధమవుతాయని అన్నారు. ఇక, కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఓటమిపై జీవీఎల్ నర్సింహారావు మాట్లాడుతూ.. తమ పార్టీకి ఓట్ల శాతంలో ఎటువంటి మార్పు లేదని చెప్పారు.
ఇదిలా ఉంటే.. ఆంధ్రప్రదేశ్‌లో రానున్న ఎన్నికల్లో పొత్తులపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఇటీవల స్పష్టనిచ్చిన సంగతి తెలిసిందే. టీడీపీ, జనసేన, బీజేపీలు కలిసి ముందుకు వెళ్తాయని చెప్పారు. జనసేన త్రిముఖ పోటీలో బలికావడానికి సిద్దంగా లేదని.. కచ్చితంగా పొత్తు ఉంటుందని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి ఎవరనేది ఎన్నికలై రిజల్ట్స్ వచ్చినప్పుడు మాట్లాడతామని చెప్పారు. దీంతో పవన్ ప్రకటన రాజకీయంగా తీవ్ర చర్చకు దారితీసింది.