కేంద్రం నుంచి ఏపీకి ఆర్థిక సహకారం మూడు రెట్లు పెరిగింది.. ఆ నిధుల గురించి ఎప్పుడైనా చెప్పారా?: జీవీఎల్

Published : Feb 14, 2022, 01:43 PM IST
కేంద్రం నుంచి ఏపీకి ఆర్థిక సహకారం మూడు రెట్లు పెరిగింది.. ఆ నిధుల గురించి ఎప్పుడైనా చెప్పారా?: జీవీఎల్

సారాంశం

ప్రత్యేక హోదా అంశం మళ్లీ హాట్ టాపిక్ అయింది. త్వరలోనే కేంద్రం వేసిన త్రీమెన్  కమిటీ సమావేశం కానున్నది. అయితే, ఈ ఎజెండాలో ప్రత్యేక హోదా అంశాన్ని పలుచన చేశారు. ఈ నేపథ్యంలోనే బీజేపీ నేత, ఎంపీ జీవీఎల్ నరసింహారావు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి కేటాయించిన నిధులను ఏకరువుపెట్టారు.  

అమరావతి: ప్రత్యేక హోదా(Special Status) మళ్లీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. కేంద్ర ప్రభుత్వం ఈ అంశంపై ముగ్గురు సభ్యులతో ఓ కమిటీ వేసింది. ఈ నెల 17వ తేదీన ఈ కమిటీ సమావేశం కానుంది. అయితే, ఈ కమిటీ ఎజెండా నుంచి ఉన్నట్టుండి ప్రత్యేక హోదా అంశంపై చర్చను పక్కకు నెట్టింది. ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలో ప్రతిపక్షాలు, ప్రభుత్వ పక్షం మధ్య వాదోపవాదాలు వేడిగా జరుగుతున్నాయి. ఇదే తరుణంలో బీజేపీ(BJP) రాజ్యసభ్యుడు జీవీఎల్ నరసింహారావు(GVL Narasimha Rao) విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న నిధులను ఏకరువు పెట్టారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి మూడు రెట్లు అధికంగా ఆర్థిక సహకారం చేస్తున్నదని వివరించారు. అదే సందర్భంలో జగన్ ప్రభుత్వంపై విమర్శలు కురిపించారు.

కేంద్ర ప్రభుత్వం పలు ప్రాజెక్టులను ఇవ్వడానికి సిద్ధమైనా రాష్ట్ర ప్రభుత్వం అందుకు వెనుకడుగు వేసిందని ఆయన ఆరోపించారు. కాకినాడలో పెట్రో కెమికల్ కాంప్లెక్స్ నిర్మాణానికి అంతా సిద్ధం అయ్యాక రాష్ట్ర ప్రభుత్వం సహకరించలేదని పేర్కొన్నారు. రాష్ట్రంలో రహదారుల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం గణనీయంగా ఖర్చుపెట్టిందని అన్నారు. ఏడు ఏళ్లలో రూ. 35వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిందని వివరించారు. మరి రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసిందని ప్రశ్నించారు. 

2014-15లో రాష్ట్రానికి కేంద్రం నుంచి 24వేల 500 కోట్ల నిధులు వచ్చాయని తెలిపారు. కానీ, 2020-21 ఆర్థిక సంవత్సరంలో ఈ నిధులు మూడు రెట్లు పెరిగాయని చెప్పారు. గత ఆర్థిక సంవత్సరంలో ఈ నిధులు 77,500 కోట్లు వచ్చాయని అన్నారు. ఇందులో పన్నుల వాటా మూడో వంతేనని పేర్కొన్నారు. మిగితా నిధులు అన్నీ గ్రాంట్ల రూపంలోనే అందాయని తెలిపారు. ఈ నిధుల గురించి రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడైనా ప్రస్తావించిందా? అని ప్రశ్నించారు. కేంద్రం ఇచ్చే నిధులను కూడా తమ నిధులుగా ప్రచారం చేస్తుందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి ప్రజల సంక్షేమం అవసరం లేదని, కేవలం వారికి ఆర్భాటాలు, ప్రచారం కావాలని, స్టిక్కర్లు వేసుకోవడం కావాలని విమర్శించారు.

వైసీపీ ఎంపీలు అక్కడ చేసేదేమీ లేదని మండిపడ్డారు. ఏం చేశారని ప్రశ్నిస్తే కేవలం లేఖలు ఇచ్చామని చేతులు దులుపుకుంటారని అన్నారు. వారి నియోజకవర్గంలో జరగాల్సిన అభివృద్ధి పనుల గురించీ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎందుకు అడగరని ప్రశ్నించారు. తాను ఇటీవలే పోలవరం నియోజకవర్గానికి వెళ్లారని పేర్కొన్నారు. అక్కడ సుమారు 200 గ్రామాలకు మంచి నీటి సరఫరా చేసే ప్రాజెక్టును ప్రభుత్వం నిలిపేసిందని ఆగ్రహించారు. ఉద్యోగులకు వేతనాలు సరిగా ఇవ్వరని అన్నారు. కేంద్ర ప్రభుత్వం జల్ జీవన్ మిషన్ కింద రూ. 3200 కోట్లు విడుదల చేస్తే రాష్ట్ర ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా తెచ్చుకోలేకపోయిందని తెలిపారు. కేంద్రం నుంచి ఈ నిధులు తెచ్చుకోలేని అసమర్థ ప్రభుత్వం జగన్ ప్రభుత్వం అని ఎద్దేవా చేశారు. ఇది ప్రభుత్వ వైఫల్యం కాక మరేమిటని ప్రశ్నించారు. ఆగిపోయిన రైల్వే నిర్మాణాల కోసం తాను స్వయంగా కేంద్ర ప్రభుత్వాన్ని అడిగానని చెప్పారు. తమ ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవని, నెలాఖరు వచ్చేసరికి ఉద్యోగులకు జీతాలు, పెన్షన్లు ఇవ్వడానికే కిందామీద అయిపోతున్నదని వివరించానని పేర్కొన్నారు. రైల్వేకు డబ్బులు ఇచ్చే ఆలోచన రాష్ట్ర ప్రభుత్వానికి లేదని వివరించినట్టు చెప్పారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : గజగజా వణికిపోతున్న తెలుగు రాష్ట్రాలు... ఈ చలి తీవ్రత తగ్గేదెన్నడో తెలుసా?
Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?