
అమరావతి: ఆంధ్ర ప్రదేశ్ లో జగన్ సర్కార్- ప్రభుత్వ ఉపాధ్యాయులకు మధ్య పీఆర్సీ వివాదం (PRC Issue) కొనసాగుతోంది. పీఆర్సీ సాధన సమితి మంత్రుల కమిటీలో సమావేశం తర్వాత శాంతించినా ఉపాధ్యాయ సంఘాలు మాత్రం ఉద్యమాన్ని కొనసాగిస్తున్నాయి. ఈ క్రమంలోనే పీఆర్సీ పెంపుతో పాటు మరికొన్ని డిమాండ్ల సాధన కోసం ఉద్యమాన్ని మరింత ఉదృతం చేయడానికి ఉపాధ్యాయులు సిద్దమయ్యారు. ఇందులో భాగంగా ఇవాళ(సోమవారం) టీచర్స్ జేఏసీ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఉద్యమ కార్యాచరణకు సంబంధించిన నోటీసులు అందజేయాలని వివిధ ఉపాధ్యాయ సంఘాలు నిర్ణయించారు.
ఇప్పటికే టీచర్స్ జేఏసీ నాయకులు సీఎస్ సమీర్ శర్మ (cs sameer sharma)ను అపాయింట్ కోరారు. ఒకవేళ ఆయన అందుబాటులో లేకుంటే కనీసం సర్వీస్ సెక్రటరీ శశి భూషణ్ కు నోటీసులు ఇవ్వాలని నిర్ణయించారు. ఇప్పటికే టీచర్స్ జేఏసీ నాయకులు సచివాలయంలో ఈ హెచ్ఎస్ మీటింగ్ కి హాజరయ్యారు. మధ్యాహ్నం మూడు గంటల తర్వాత ఉద్యమ కార్యాచరణ నోటీసు ఇచ్చే అవకాశముంది.
ఇక ఉపాధ్యాయ సంఘాల తదుపరి కార్యాచరణ ఇవాళ్టి నుండే ప్రారంభం కానుంది. ఇవాళ సీఎస్ కు కార్యాచరణపై నోటీసులు అందించి ఫిబ్రవరి 14,15 తేదీలలో సీఎం జగన్ తో చర్చలకు ప్రతిపాదనలు పంపనున్నట్లు తెలిపారు. ఇక ఫిబ్రవరి 15 నుంచీ 20 వరకూ పీఆర్సీపై పునః సమీక్షకు సంతకాల సేకరణ చేపట్టనున్నారు. ఈ నెల 21 నుంచీ 24 వరకు ఉద్యోగ, ఉపాధ్యాయ పెన్షనర్ల తో బ్యాలెట్ల నిర్వహణ చేపట్టడమే కాదు మంత్రులు, ఎంఎల్ఏ లకు విజ్ఞాపన సమర్పించాలని నిర్ణయించారు.
ఫిబ్రవరి 25నన ప్రభుత్వానికి బహిరంగ లేఖ రాయాలని నిర్ణయించారు. ఇక వచ్చే నెల మార్చి 2,3 తేదీలలో జిల్లా కలెక్టరేట్ల వద్ద రిలే నిరాహారదీక్ష చేయనున్నారు. అలాగే మార్చి 7,8 తేదీలలో రాష్ట్రస్ధాయి రిలే నిరాహారదీక్ష నిర్వహణకు ఉపాధ్యాయ సంఘాలు కార్యాచరణ రూపొందించాయి.
ఇప్పటికే పీఆర్సీ సాధన కోసం మరో ఐక్య వేదిక ఏర్పాటయ్యింది. ప్రభుత్వ ఉద్యోగ సంఘాల జేఏసీ పీఆర్సీపై ప్రభుత్వం స్పష్టమైన నిర్ణయాన్ని తీసుకోకుండానే వెనక్కితగ్గిందని పలు ఉద్యోగ సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఇలా ఉద్యోగ సంఘాల జేఏసీతో విభేదించిన ఉద్యోగ సంఘాలు పీఆర్సీ ఉద్యమాన్ని కొనసాగించడానికి కొత్త జేఏసీగా ఏర్పడ్డాయి. ఈ జేఏసిలో ఉపాధ్యాయ సంఘాలు కీలకంగా వ్యవహరిస్తోంది. పలు ఉద్యోగ సంఘాలు, కార్మిక, పింఛనుదారుల ఐక్యవేదిక ఏర్పాటైంది. ఇలా పీఆర్సీ కోసం పోరాడేందుకు 34 ఉద్యోగ సంఘాలు జేఏసిగా ఏర్పడ్డాయి.
కొత్తగా ఏర్పడిన జేఏసి విజయవాడలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించింది. ఈ సమావేశంలో పీఆర్సీ పెంపు, ఉద్యోగుల ఇతర సమస్యలపై చర్చించి ఉద్యమ కార్యాచరణ రూపొందించారు. మంత్రుల కమిటీతో గతంలో పీఆర్సీ సాధన సమితి చేసుకున్న ఒప్పందాలను ఈ జేఏసి వ్యతిరేకించింది. పిట్ మెంట్ ను 27శాతానికి పెంచడమే కాదు గ్రాట్యుటీని 2020 ఏప్రిల్ నుండి అమలు చేయాలని, పొరుగుసేవల ఉద్యోగులు క్రమబద్దీకరణ చేయాలంటూ వివిధ డిమాండ్ల సాధనకు ప్రభుత్వంతో పోరాటానికి సిద్దమయ్యారు. ఇందుకోసం కార్యాచరణను కూడా సిద్దం చేసారు.