
ఆంధ్రప్రదేశ్ అభివృద్దికి కేంద్రం అధిక ప్రాధాన్యత ఇస్తుందని బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు అన్నారు. రాష్ట్రానికి నిధులిచ్చి ఏపీపై మోదీ తన అభిమానాన్ని చాటుకున్నారని చెప్పారు. నిధులను పక్కదారి పట్టిస్తే కేంద్రం చూస్తూ ఊరుకోదని అన్నారు. వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి అరెస్ట్ ఎప్పుడనే అంశంలో ఉత్కంఠ అవసరం లేదని వ్యాఖ్యానించారు. సీబీఐ నిర్ణయం తీసుకుంటే ఏ స్థాయికైనా వెళ్తుందని చెప్పారు. రౌడీయిజం చేసి సీబీఐని అడ్డుకోవడం సాధ్యం కాదని తెలిపారు. ఫ్యాక్షనిజం ఒత్తిళ్లకు కేంద్ర దర్యాప్తు సంస్థలు లొంగవని చెప్పారు.
సీబీఐ నిర్ణయం తీసుకుంటే ఆపడం ఎవరి తరం కాదని జీవీఎల్ నర్సింహారావు అన్నారు. సీబీఐ సంస్థ తాటాకు చప్పుళ్లకు భయపడే సంస్థ కాదని జీవీఎల్ చెప్పారు. తోక పార్టీల విమర్శలు పట్టించుకోవాల్సిన అవసరం లేదని చెప్పారు.
ఇదిలా ఉంటే.. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న అవినాష్ రెడ్డిని సీబీఐ అరెస్ట్ చేస్తుందని కొంతకాలంగా ప్రచారం సాగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే పలు నాటకీయ పరిణామాలు చోటుచేసుకుంటున్నారు.