విశాఖ అభివృద్ధి అయితే చాలా?

Published : Feb 07, 2017, 01:11 AM ISTUpdated : Mar 25, 2018, 11:46 PM IST
విశాఖ అభివృద్ధి అయితే చాలా?

సారాంశం

రాష్ట్ర రాజకీయాల్లో చక్రం తిప్పగలిగిన నేత ఏ పార్టీలోనూ లేకపోవటం కూడా ఉత్తరాంధ్రకు ఇబ్బందిగానే మారింది. కేంద్ర, రాష్ట్రాల్లో మంత్రులుగా చేసిన వారు, చేస్తున్న వారిలో కూడా చిత్తశుద్ది లోపించటం వల్లే ఉత్తరాంధ్ర అభివృద్ధికి ఆమడదూరంలో నిలిచిపోతోంది.

 

 

పాలకుల్లో ఉత్తరాంధ్ర మొత్తం మీద విశాఖ నగరం అభివృద్ధి జరిగితే చాలన్నట్లుగా కనిపిస్తోంది. ఎందుకంటే, ఉత్తరాంధ్ర అభివృద్ధి గురించి ప్రజలడిగినప్పుడల్లా విశాఖపట్నం అభివృద్ధినే ప్రభుత్వాలు చూపిస్తున్నాయి. అంటే అర్ధమేమిటి? మొత్తం ఉత్తరాంధ్రలో విశాఖపట్నం తప్ప మరే ప్రాంతమూ లేదనా? లేకపోతే ఇప్పటికే మిగిలిన ప్రాంతాలు బాగా అభివృద్ధి జరిగాయనా?  పాలకుల్లోని ఈ వైఖరి వల్లే ప్రభుత్వం పట్ల ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతోంది.

 

ఉత్తరాంధ్రలోని విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో 34 నియోజకవర్గాలున్నాయి. ఇందులో విశాఖ (వుడా)నగరంలోనే ఏడున్నాయి. మూడు జిల్లాల్లోని మొత్తం నియోజకవర్గాల్లో ఈ ఏడు నియోజకవర్గాలే కీలకం కావటంతో ఏ ప్రభుత్వమైనా ఒక్క విశాఖనగరం అభివృద్ధిపైనే దృష్టి పెట్టింది. దాంతో మిగిలిన 27 నియోజకవర్గాలు అభివృద్ధికి ఆమడదూరంలో ఆగిపోతున్నాయి.

 

విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నం జిల్లాల్లో గ్రామీణ ప్రాంతాలే ఎక్కువ. అందులోనూ 24 మండలాలు పూర్తిగా గిరిజన మండలాలే కావటంతో నిరక్షరాస్యత కూడా ఎక్కవే. విశాఖ నగరం మినహా మిగిలిన మూడు జిల్లాల్లోని ప్రజాప్రతినిధుల్లో లోపించిన చిత్తశుద్ది వల్ల మూడు జిల్లాలకు మంజూరవుతున్న పథకాల్లో ఎక్కవ భాగం వుడా పరిధిలోనే అమలవుతున్నాయి. దాంతో ఏరంగంలో అభివృద్ధి తీసుకున్నా మొత్తం వుడాలోనే కేంద్రీకృతమవుతోంది. ప్రస్తుతం ఈ విషయంలోనే ఉత్తరాంధ్ర ప్రజలు పాలకులపై మండిపడుతున్నారు.

 

వుడా పరిధిని మినహాయిస్తే మిగిలిన మూడు జిల్లాల్లోనూ విద్య, వైద్య, ఉపాధి సౌకర్యాలు దాదాపు లేవు. కార్పొరేట్ వైద్యమంటేనే వారికి తెలీదు. ఎవరికి ఏ రోగమొచ్చినా విశాఖ నగరానికి రావాల్సిందే. అవటానికి జిల్లా కేంద్రాలే అయినా విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో కూడా వసతులు అంతంతమాత్రమే. మూడు జిల్లాలు సమానంగా అభివృద్ధి చెందాలంటే ప్రభుత్వమే పూనుకోవాలి. పెద్ద ఆసుపత్రులను పెట్టాలి. విద్యా సంస్ధలను ఏర్పాటు చేయాలి. అప్పుడే స్ధానికులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరుగుతాయి.

 

ఇటువంటి అంశాలపై పాలకులు దృష్టి పెట్టని కారణంగానే విజయనగరం, శ్రీకాకుళం జిల్లా నుండి సుమారు 15 లక్షల మంది ప్రజలు వలసెళ్ళిపోయారు. అంటే, ఉత్తరాంధ్రలోని మొత్తం 94 లక్షల జనాభాలో సుమారు 15 శాతం జనాలు ఊర్లను ఖాళీ చేసేసారు. రాష్ట్ర రాజకీయాల్లో చక్రం తిప్పగలిగిన నేత ఏ పార్టీలోనూ లేకపోవటం కూడా ఉత్తరాంధ్రకు ఇబ్బందిగానే మారింది.  కేంద్ర, రాష్ట్రాల్లో మంత్రులుగా చేసిన వారు, చేస్తున్న వారిలో కూడా చిత్తశుద్ది లోపించటం వల్లే ఉత్తరాంధ్ర అభివృద్ధికి ఆమడదూరంలో నిలిచిపోతోంది.

PREV
click me!

Recommended Stories

కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయం లోఫుడ్ కమీషన్ చైర్మన్ తనిఖీ | Asianet News Telugu
LVM3-M6 Success Story | ప్రపంచానికి భారత్ సత్తా చాటిన ఇస్రో బాహుబలి | Asianet News Telugu