
పల్నాడు: పల్నాడు జిల్లాలో గురజాల మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు, మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మధ్య మాటల యుద్ధం సాగుతుంది. ఇద్దరు నేతలు పరస్పరం తీవ్ర స్థాయిలో విమర్శలు చేసుకుంటున్నారు. మాచర్ల అసెంబ్లీ నియోజకవర్గంలో ఇటీవల కాలంలో టీడీపీ, వైసీపీ మధ్య జరిగిన ఘర్షణల నేపథ్యంలో ఈ ఇద్దరు నేతల మధ్య మాటల యుద్ధం సాగుతుంది. మాచర్లలో మంటలు పెట్టేందుకు చంద్రబాబు సూచనలతో యరపతినేని శ్రీనివాస రావు ప్రయత్నిస్తున్నారని పిన్నెల్లి రామకృష్ణారెడ్డి విమర్శలు చేశారు. యరపతినేని శ్రీనివాసరావు తన పద్దతిని మార్చుకోకపోతే మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు.
మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వ్యాఖ్యలకు యరపతినేని శ్రీనివాసరావు కౌంటరిచ్చారు. బ్రహ్మరెడ్డిపై దాడి చేసి మీ గొయ్యి మీరే తవ్వుకున్నారని యరపతినేని శ్రీనివాసరావు చెప్పారు. 1994, 1999 ఎన్నికల్లో మాచర్లలో మీ బాబాయిలు ఓటమి పాలైనప్పుడు మీరు నిక్కర్లు వేసుకున్నారన్నారు. పిన్నెల్లి సోదరులు తలకెక్కిన అహంకారాన్ని దించుకోవాలని ఆయన కోరారు. మీ మాదిరిగా జైలుకు వెళ్లి వచ్చిన కుటుంబం బ్రహ్మరెడ్డిది కాదన్నారు. బ్రహ్మరెడ్డి కుటుంబం స్వాతంత్ర్య సమరయోధుల కుటుంబమేనని ఆయన చెప్పారు. మీ మాదిరిగా ఆరేళ్ల పిల్లలను చంపిన చరిత్ర బ్రహ్మరెడ్డికి లేదన్నారు. వచ్చే ఎన్నికల్లో పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి మాచర్ల ప్రజలు పాతరేస్తారన్నారు. ఆరు మాసాల క్రితం మాచర్ల ఎమ్మెల్యేల పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మధ్య మాటల యుద్ధం సాగిన విషయం తెలిసిందే.
మాచర్ల లో ఇదేం ఖర్మ కార్యక్రమాన్ని నిర్వహించే సమయంలో టీడీపీ, వైసీపీ వర్గీయుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఇరు వర్గాలు దాడులు చేసుకున్నాయి. పలు వాహనాలను దగ్దమయ్యాయి. ఈ నెల 16న ఈ ఘటన జరిగింది.ఈ ఘటనపై పోలీసుల తీరును టీడీపీ నేతలు తప్పుబట్టారు. టీడీపీ చీఫ్ చంద్రబాబు ట్విట్టర్ వేదికగా విమర్శలు చేశారు. ఇరువర్గాలు తమపై దాడులు చేశారని ఆరోపణలు చేసుకున్న విషయం తెలిసిందే .ప్రశాంతంగా ఉన్న మాచర్లలో ఫ్యాక్షన్ ను సృష్టించేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని వైసీపీ నేతలు ఆరోపించారు. ఇందులో భాగంగానే జూలకంటి బ్రహ్మరెడ్డిని టీడీపీ మాచర్ల ఇంచార్జీగా నియమించారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు.