
గుంటూరు : ఆంధ్ర ప్రదేశ్ లో కరెంట్ కోతల మరీ ఎక్కవయ్యాయి. ఎప్పుడు వుటుందో ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితి రాష్ట్రంలో నెలకొంది. ఏవేవో కారణాలు చెప్పి వేళకాని వేళ విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నారని రైతులు, సామాన్య ప్రజలు వాపోతున్నారు. ఈ విద్యుత్ కోతలతో విసిగిపోయిన ప్రజలు రోడ్డెక్కి ఆందోళనకు దిగుతున్నారంటే పరిస్థితి ఎలావుందో అర్థంచేసుకోవచ్చు. గుంటూరు జిల్లాలో కరెంట్ కోతలపై ఆగ్రహం వ్యక్తంచేస్తూ సబ్ స్టేషన్ ముందు ప్రజలు ఆందోళనకు దిగారు.
ఉమ్మడి గుంటూరు జిల్లాలోని పలు ప్రాంతాల్లో గత రాత్రి 7 గంటల నుండి 11గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేసారు. తెనాలి రూరల్, మంగళగిరి నియోజకవర్గంలోని దుగ్గిరాల, పొన్నూరు నియోజకవర్గంలోని చేబ్రోలు మండలాల్లో కరెంట్ లేక ప్రజలు అల్లాడిపోయారు. వేమూరు నియోజకవర్గ కేంద్రంతో పాటు కొల్లిపర, కొల్లూరు, భట్టిప్రోలు, అమర్తలూరు మండలాల్లోనూ విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.
వీడియో
రాత్రి సమయంలో కరెంట్ తీసివేయడంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేస్తూ ప్రజలు రోడ్డెక్కారు. తెనాలి పట్టణ సమీపంలోని కొలకలూరు గ్రామ సమీపంలోని విద్యుత్ సబ్ స్టేషన్ ను గ్రామస్తులు ముట్టడించారు. సబ్ స్టేషన్ ముందే రోడ్డుపై బైఠాయించి ఆందోళనకు దిగారు. దీంతో వాహనాలు రాకపోకలు నిలిచిపోయి రెండు కిలోమీటర్ల మేర భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.
Read More దిగొచ్చిన ఏపీ ప్రభుత్వం, పీఆర్సీకీ ఓకే .. సమ్మెను ఉపసంహరించుకున్న విద్యుత్ ఉద్యోగులు
ప్రజాందోళనపై సమాచారం అందుకున్న పోలసులు ప్రజలను సముదాయించే ప్రయత్నం చేసారు. ఈ క్రమంలో పోలీసులతో ఆందోళనకు వాగ్వాదానికి దిగారు. కరెంట్ కోతలతో ఇళ్లలో వుండలేకపోతున్నామని... గంటలకు గంటలు తీసేయడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. కరెంట్ పోయిందంటే తిరిగి ఎప్పుడు వస్తుందా అని చీకట్లోనే పడిగాపులు కాయాల్సి వస్తోందన్నారు. దయచేసి కోతలు లేకుండా విద్యుత్ సరఫరా చేయాలని గుంటూరు ప్రజలు కోరుతున్నారు.