జీన్స్, టీ షర్టులతో పురుష వాహనదారులకు వల వేస్తారు. తాము నిస్సహాయులం సాయం చేయమంటూ అడుగుతారు. కాదన్నారో బ్లాక్ మెయిల్ కు దిగుతారు. అలాంటి ఓ గుజరాత్ మహిళల ముఠాను గుంటూరు పోలీసులు అరెస్ట్ చేశారు.
గుంటూరు : Guntur జిల్లాలో వాహనదారుల నుంచి డబ్బు గుంజుతున్న Gujarat Woman Gangను పోలీసులు అరెస్టు చేశారు. ముఠాలో మొత్తం 32 మంది మహిళలు ఉన్నట్లు గుర్తించారు. గుంటూరు నుంచి తెనాలి వెళ్లే మార్గంతో పాటు పెదకాకాని హైవే తదితర ప్రాంతాల్లో వాహనదారులను బెదిరించి డబ్బులు గుంజుతున్నట్లు పోలీసులకు ఫిర్యాదు అందింది. దీంతో పోలీసులు 45 బృందాలుగా ఏర్పడి మొత్తం 18 మందిని అరెస్టు చేశారు. మిగిలిన వారికోసం గాలిస్తున్నారు. పెదకాకాని పరిధిలో ఐదుగురిని అరెస్టు చేసినట్లు సీఐ బండారు సురేష్ బాబు తెలిపారు.
ఆయన తెలిపిన వివరాల ప్రకారం… గుజరాత్లోని దుర్గానగర్ కు చెందిన ఐదుగురు యువతులు గుంటూరు సమీపంలోని ఇన్నర్ రింగ్ రోడ్డుతో పాటు కొన్ని ప్రాంతాల్లో వాహనాలను ఆపుతున్నారు. తమది గుజరాత్ అని… ప్రకృతి వైపరీత్యాలతో తమ గ్రామం లేకుండా పోయిందంటూ కరపత్రాలు చూపిస్తూ డబ్బులు వసూలు చేస్తున్నారు. డబ్బులు ఇవ్వని వాహనదారుల నుంచి వాహనాల తాళాలు లాక్కొన్ని ఇబ్బందులకు గురిచేస్తున్నారు. డబ్బులు ఇవ్వకపోతే తమతో అసభ్యంగా ప్రవర్తించారంటూ కేసు పెడతానని బ్లాక్ మెయిల్ చేస్తున్నారు. గుంటూరుకు చెందిన సాయితేజ రెడ్డి అనే వాహనదారుడు ఇచ్చిన ఫిర్యాదుతో సదరు యువతులపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేసినట్లు సిఐ తెలిపారు.
ఇదిలా ఉండగా, ఇలాంటి ఘటన నిరుడు ఆగస్ట్ లో హైదరాబాద్ లో జరిగింది. వలపు వల విసిరి క్షణాల్లో యువకుడిని బుట్టలో వేసుకుందో మాయ'కి'లేడి. మాయమాటలతో నమ్మించి అతడిని వంచింఛింది. ఆమె మాయమాటలు నమ్మిన యువకుడు తన ప్రయాణాన్ని వాయిదా వేసుకుని మరీ మహిళతో వెళ్లి నిలువునా మోసపోయిన ఘటన తెలంగాణ రాజధాన్ని హైదరాబాద్ లో చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళితే... హైదరాబాద్ కూకట్ పల్లి ప్రాంతానికి చెందిన యువకుడు శ్రీధర్ ఆగస్ట్ 22న భద్రాచలంకు పయనమయ్యాడు. ఈ క్రమంలోనే ఉదయం కేపీహెచ్ బీ మెట్రో స్టేషన్ కు వెళ్లాడు. రైలు కోసం ఎదురు చూస్తున్న క్రమంలో శ్రీధర్ ను ఓ మహిళ పరిచయం చేసుకుంది. అతడికి మాయమాటలు చేప్పి కవ్వించి తన వెంట వచ్చేలా చేసింది. మహిళ మాటల మాయలో పడిపోయిన శ్రీధర్ తన ప్రయాణాన్ని పక్కనపెట్టి ఆమె వెంట వెళ్లాడు. ఇద్దరూ కలిసి ఆటోలో ఎల్లమ్మ బండ ప్రాంతానికి వెళ్లారు. అక్కడ నిర్మానుష్య ప్రాంతానికి శ్రీధర్ ను తీసుకెళ్ళిన సదరు మహిళ తన పని కానిచ్చేసింది.
అక్కడ జోగేందర్ సింగ్, ముత్యాల విష్ణు అనే మరో ఇద్దరూ వీరితో కలిశారు. వారిద్దరితో కలిసి ఆ యువతి శ్రీధర్ ను చితకబాది అతడి వద్దనుండి పర్సు, ఫోన్, వాచ్ తో పాటు మెడలోని బంగారు గొలుసు లాక్కున్నారు. ఇలా మాయలేడి వలలో పడి మోసపోయిన శ్రీధర్ తన స్నేహితుడి సాయంతో పోలీసులను ఆశ్రయించాడు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు మహిళతో పాటు ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు. వారి నుండి కొంత బంగారం, రెండు బైక్ లు స్వాధీనం చేసుకున్నారు.