నవ వరుడు మృతి.. చివరి చూపు కూడా దక్కక..

By telugu news teamFirst Published May 2, 2020, 10:29 AM IST
Highlights

ఇటీవల నరేష్ ప్రమాదానికి గురయ్యాడు. ఆస్పత్రిలో చేర్పించగా..చికిత్స పొందుతూ కన్నుమూశాడు. అయితే.. లాక్ డౌన్ కారణంగా కనీసం భర్త చనిపోయినా చూడటానికి కూడా అతని భార్యకు అవకాశం లభించకపోవడం విషాదకరం. 
 

పెళ్లైన మూడు నెలలకే ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. లాక్ డౌన్ కారణంగా వరుడు ఓ చోట, వధువు ఓ చోట ఉండిపోయారు. అయితే.. భర్త ప్రాణాలు పోయినా.. కనీసం భార్యకి కడసారి చూపు కూడా దక్కలేదు. ఈ దారుణ సంఘటన విజయవాడలో చోటుచేసుకోగా.. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

గోవిందపురం గ్రామానికి చెందిన ఎర్రబోలు నరేష్‌(26) శ్రీకాకుళం జిల్లా పైడిభీమవరంలోని సరాకా ల్యాబ్‌ పరిశ్రమలో విధులు నిర్వహిస్తున్నాడు. ఈ ఏడాది ఫిబ్రవరి 9న విజయవాడకు చెందిన యువతితో నరేష్‌కు వివాహమైంది. సంప్రదాయం ప్రకారం మార్చి మొదటి వారంలో భార్యను తీసుకొని నరేష్‌ అత్తింటికి వెళ్లాడు. ఉగాదికి వెళ్లి ఆమెను తనతో పాటు తీసుకురావాలని అనుకున్నాడు. అత్తమామలతో అదేమాట చెప్పి...స్వగ్రామానికి వచ్చేశాడు. లాక్‌డౌన్‌ నేపథ్యంలో మళ్లీ భార్యను చూసేందుకు   అత్తవారింటికి వెళ్లే అవకాశం లేకుండాపోయింది.

ఇదిలా ఉండగా.. ఇటీవల నరేష్ ప్రమాదానికి గురయ్యాడు. ఆస్పత్రిలో చేర్పించగా..చికిత్స పొందుతూ కన్నుమూశాడు. అయితే.. లాక్ డౌన్ కారణంగా కనీసం భర్త చనిపోయినా చూడటానికి కూడా అతని భార్యకు అవకాశం లభించకపోవడం విషాదకరం. 

విజయవాడలో తల్లిదండ్రుల వద్ద ఉంటున్న యువతికి నరేష్‌ మృతిచెందిన విషయాన్ని గురువారం కుటుంబ సభ్యులు ఫోన్‌ ద్వారా తెలియజేశారు. అక్కడి నుంచి ఆమెను రప్పించేందుకు విశ్వప్రయత్నాలు చేశారు. ఆమె కూడా రెడ్‌జోన్‌లో ఉండడంతో భర్తను కడసారి చూసేందుకు కూడా అవకాశం లేకుండాపోయింది. 

దీంతో ఆమె కన్నీరుమున్నీరుగా విలపించింది. వీడియో కాల్‌ ద్వారా భర్త అంత్యక్రియలు చూడాల్సి వచ్చింది. ఈ సంఘటన స్థానికులను కలచివేసింది. పెళ్లయ్యాక భార్యాభర్తలిద్దరూ కనీసం నెల రోజులు కూడా కలసి ఉండలేదని... సంప్రదాయాన్ని పాటించాల్సి రావడంతో వేర్వేరుగా ఉండాల్సి వచ్చిందని... ఇంతలోనే ఈ ఘోరం జరుగుతుందని కుటుంబసభ్యులు వాపోయారు.

click me!