పంచామృతాభిషేకం ధర పెంపుపై రగడ.. కాణిపాకం ఇన్‌ఛార్జ్ ఈవోపై వేటు

By Siva KodatiFirst Published Oct 7, 2022, 9:51 PM IST
Highlights

ప్రముఖ పుణ్యక్షేత్రం కాణిపాకం వరసిద్ధి వినాయక ఆలయంలో పంచామృతాభిషేకం ధర పెంచుతున్నట్లు వార్తలు రావడంపై ట్రస్ట్ బోర్డ్ స్పందించింది. ధరలను పెంచడం లేదని.. సామాన్య భక్తులకు అందబాటులోనే ధరలు వుంటాయని తెలిపింది. అయితే ఇన్‌ఛార్జ్ ఈవో సురేష్ బాబుపై దేవాదాయ శాఖ బదిలీ వేటు వేసింది

కాణిపాకం ఇన్‌ఛార్జ్ ఈవో సురేష్ బాబుపై దేవాదాయ శాఖ బదిలీ వేటు వేసింది. బాధ్యతల నుంచి తప్పిస్తూ దేవాదాయ శాఖ ఆదేశించింది. వినాయకుడి పంచామృతాభిషేకం టికెట్ ధరను రూ.700 నుంచి రూ.5 వేలకు పెంచుతూ సురేశ్ బాబు నోటిఫికేషన్ ఇచ్చారు. దీనిపై వివాదం రేగడంతో ఈవోపై చర్యలు తీసుకుంది ప్రభుత్వం. కాణిపాకం ఆలయ కొత్త ఈవోగా రాణా ప్రతాప్‌ను నియమించింది. అలాగే సురేష్‌బాబుకు షోకాజ్ నోటీసు సైతం జారీ చేసింది. 

అంతకుముందు రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్ ఆదేశాలతో వరసిద్ధి వినాయక స్వామివారి పంచామృతాభిషేకం టికెట్ ధరలను భారీగా పెంచుతూ ఆలయ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఆలయంలో పంచామృతాభిషేకం ధర ఏడు రెట్లు పెంచారు. ప్రస్తుతం పంచామృతాభిషేకం టికెట్ ధర రూ.750లు ఉంది. అయితే, ఇప్పుడు ఏడురెట్లు పెరగడంతో రూ.750 టికెట్ ధర ఏకంగా రూ.5000లకు చేరుకుంది.

ALso Read:కాణిపాకం : భక్తులకు ఊరట... పంచామృతాభిషేకం ధర పెంపుపై వెనక్కి తగ్గిన పాలక మండలి

ఆలయంలో ఇప్పటి వరకూ ప్రతిరోజూ మూడుసార్లు పంచామృతాభిషేకం నిర్వహిస్తున్నారు. ఇక నుంచి ఈ సేవ భక్తులకు ఉదయం ఐదు నుంచి ఆరు గంటల వరకు కూడా అందుబాటులో ఉంచనున్నారు. ఈ నేపథ్యంలో ఈ ప్రత్యేక అభిషేకానికి భారీగా టికెట్ ధరను నిర్ణయించింది దేవస్థానం. అయితే ఈ పంచామృతాభిషేకం ధర పెంపు పై అభిప్రాయాలు తెలిపేందుకు ఉభయదారులకు 15 రోజుల గడువు విధించింది. ఈ మేరకు ఒక నోటీసును కూడా విడుదల చేసింది.

ఈ వార్తలతో భక్తులు భయాందోళనకు గురయ్యారు. దీనిపై కాణిపాకం ట్రస్ట్ బోర్డ్ క్లారిటీ ఇచ్చింది. అటు దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ కూడా ఈ వ్యవహారంపై స్పందించారు. కాణిపాకం అభిషేకం టికెట్ ధరలు పెరగలేదని ఆయన స్పష్టం చేశారు. ప్రస్తుతం వున్న రూ.700 ధర యథాతథంగా వుంటుందని తెలిపారు. టికెట్ ధర పెంపుపై ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్న అధికారులను తొలగించాలన్నారు మంత్రి. 

click me!