తుఫాన్‌తో నష్టోయిన రైతులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలి: టీడీపీ

By telugu teamFirst Published Sep 27, 2021, 6:31 PM IST
Highlights

తుఫాన్‌తో రైతులు, పౌరులు నష్టపోయారని, వారిని వెంటనే ఆదుకోవాలని టీడీపీ స్ట్రాటజీ కమిటీ డిమాండ్ చేసింది. వరదలతో ఇబ్బంది పడుతున్నవారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని, సహాయక చర్యలు యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలని తెలిపింది. రైతులు పిలుపునిచ్చిన భారత్ బంద్‌కు టీడీపీ సంపూర్ణ మద్దతు ఇచ్చిందని వివరించింది. రైతుల విషయంలో వైసీపీ ద్వంద్వ వైఖరి అనుసరిస్తున్నదని పేర్కొంది.
 

అమరావతి: గులాబ్ తుఫాన్‌తో నష్టపోయిన రైతులను, నిరాశ్రయులైన ప్రజలను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని టీడీపీ డిమాండ్ చేసింది. తుఫాన్‌తో ఇబ్బందులుపడుతున్న ప్రజలను యుద్ధప్రాతిపదికన సురక్షిత ప్రాంతాలకు తరలించాలని, నిత్యావసర సరుకులను పంపిణీ చేసి అన్ని విధాల అండగా నిలబడాలని తెలిపింది. రాష్ట్రంలో జగన్ రెడ్డి సాగు రంగాన్ని సంక్షోభంలోకి నెట్టిందని పేర్కొంది. మూడు సాగు చట్టాలకు పార్లమెంటులో మద్దతు ఇచ్చి ఇప్పుడు రైతుల భారత్ బంద్‌కు మద్దతు తెలిపి దాని ద్వంద్వ వైఖరిని వెల్లడిస్తున్నదని విమర్శించింది. భారత్ బంద్‌కు టీడీపీ సంపూర్ణ మద్దతు ఇచ్చిదని తెలిపింది. తెలుగు దేశం పార్టీ చీఫ్ చంద్రబాబు సారథ్యంలో పార్టీ స్ట్రాటజీ కమిటీ సమావేశమైంది. ఈ భేటీలో కీలక నిర్ణయాలు తీసుకుంది.

సాగు నీటి ప్రాజెక్ట్‌ల విషయంలో రాయలసీమకు జగన్ ప్రభుత్వం చేస్తున్న ద్రోహంపై వచ్చే నెల 6వ తేదీన హిందూపురంలో టీడీపీ సమావేశాన్ని నిర్వహించనుంది. జగన్ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పులమయం చేశారని, ప్రజల ఆస్తులను తనఖా పెట్టారని ఆరోపించింది. డ్రగ్స్ అక్రమ రవాణా విషయంలో డీజీపీ వాస్తవాలను దాచిపెడుతున్నారని పేర్కొంది. ఆషి ట్రేడింగ్ జూన్ వరకు తొమ్మిది సార్లు జీఎస్టీ రిటర్న్స్ ఫైల్ చేసిందని, కానీ, డీజీపీ మాత్రం కేవలం రిజిస్ట్రేషన్ మాత్రమే విజయవాడలో ఉన్నదని, మరేమీ కార్యకలాపాలు ఇక్కడ లేవని చెప్పారని తెలిపింది. అసెంబ్లీలో అచ్చెన్నాయుడు మైక్ కట్ చేయాలని నిర్ణయించడం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమేనని వివరించింది.

రాష్ట్రంలో విషజ్వరాలు ప్రబలుతున్నాయని, నివారణ చర్యలు చేపట్టడం లేదని టీడీపీ తెలిపింది. రాష్ట్రాన్ని నేడు అనారోగ్యాంధ్రప్రదేశ్‌గా మార్చారని ఆరోపించింది. రాష్ట్రంలో పెద్ద ఎత్తున రేషన్ కార్డులు, పెన్షన్‌లను తొలగించారని, సంక్షేమ కార్యక్రమాల్లో కోత విధించే కుట్ర చేస్తున్నదని వివరించింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సబ్ ప్లాన్ నిధులు దారి మళ్లింపుపై ఆందోళన కార్యక్రమాలు నిర్వహించాలని స్ట్రాటజీ కమిటీ నిర్ణయించింది.

click me!