కరోనా పాజిటివ్ రిపోర్టు చూపించి మందు...: ఆనందయ్య వెల్లడి

By telugu teamFirst Published Jun 2, 2021, 2:23 PM IST
Highlights

ఇతర ప్రాంతాలవారు ఎవరు కూడా కృష్ణపట్నం రావద్దని, తానే ఇతర ప్రాంతాలకు మందును పంపిస్తానని బొనిగె ఆనందయ్య చెప్పారు. ఆదివారం నుంచి లేదా సోమవారం నుంచి మందు పంపిణీ చేయనున్నట్లు ఆయన తెలిపారు.

నెల్లూరు: కరోనా పాజిటివ్ రిపోర్టు చూపించి మందు తీసుకోవచ్చునని బొనిగె ఆనందయ్య చెప్పారు. ఇతర ప్రాంతాలవాళ్లు కృష్ణపట్నం రావద్దని, తామే మందు పంపిస్తామని, కరోనా పాజిటివ్ రిపోర్టు చూపించి మందు తీసుకోవచ్చునని ఆయన చెప్పారు. ఆదివారం నుంచి లేదా సోమవారం నుంచి మందు పంపిణీ చేస్తామని ఆయన చెప్పారు. తనకు సహకరించినవారందరికీ ఆయన ధన్యావాదాలు తెలిపారు.

ఇదిలావుంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలోకి స్థానికేతరులను పోలీసులు అనుమతించడం లేదు. కృష్ణపట్నంలో 144వ సెక్షన్ ను అమలు చేస్తున్నారు. ఆనందయ్య మందు కోసం ప్రజలు వచ్చే అవకాశాలు ఉండడంతో వారిని అడ్డగించడానికి పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. 

గ్రామస్తులను మాత్రమే వారు కృష్ణపట్నంలోకి అనుమతిస్తున్నారు. వారు కూడా ఆధార్ కార్డు చూపించాల్సిందే. ఆధార్ కార్డు చూపించిన తర్వాత వారు కృష్ణపట్నానికి చెందినవారేనని నిర్దారించుకున్న తర్వాతనే లోనికి అనుమతిస్తున్నారు. 

ఆనందయ్య మందు కోసం ఎవరూ కృష్ణపట్నం గ్రామానికి రావద్దని అధికారులు సూచించారు. ఆనందయ్య మందు పంపిణీకి మరో నాలుగు రోజులు పట్టే అవకాశం ఉంది. ఆనందయ్య మందు తయారీ కేంద్రాన్ని కృష్ణపట్నం పోర్టుకు తరలించారు. హైదరాబాదులో బత్తిని సోదరులు పంపిణీ చేస్తున్న చేప మందు లాగానే ఆనందయ్య తన మందును పంపిణీ చేసుకోవచ్చునని ప్రభుత్వం చెప్పింది. అయితే, మందు కోసం ఎవరూ కృష్ణపట్నం రావద్దని, దాన్ని పొందడానికి ఓ ప్రత్యేక యాప్ ను తయారు చేస్తున్నామని చెప్పారు.

ఆనందయ్య మందు పంపిణీపై తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) వెనక్కి తగ్గింది. ఆనందయ్య మందు పంపిణీ చేస్తామని తొలుత ప్రకటించిన టీటీడీ దానిపై నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. ఆనందయ్య మందు ఆయుర్వేదం కాదని, నాటు మందు మాత్రమేనని ప్రకటించిన నేపథ్యంలో ఆ నిర్ణయం తీసుకుంది. 

కంట్లో వేసే చుక్కల మందుకు తప్ప మిగతా మందుల పంపిణీకి ఆనందయ్యకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. కంట్లో వేసే చుక్కల మందుకు కూడా అనుమతి ఇవ్వాలని ఆనందయ్య హైకోర్టును కోరారు. దీనిపై హైకోర్టు గురువారం నిర్ణయం ప్రకటించే అవకాశం ఉంది. 
 

click me!