
ఏలూరు జిల్లాలోని ద్వారక తిరుమల మండలం జి కొత్తపల్లిలో గోపాలపురం ఎమ్మెల్యే తలారి వెంకట్రావుపై దాడి జరగడం తీవ్ర కలకలం రేపింది. హత్యకు గురైన వైసీపీ నేతను పరామర్శించేందుకు వెళ్లిన సమయంలో సొంత పార్టీ నేతలే ఆయనపై దాడి చేశారు. ఈ ఘటనలో ఎమ్మెల్యేకు గాయాలు అయ్యాయి, ఆయన చొక్కా కూడి చిరిగిపోయింది. ఈ పరిస్థితుల నేపథ్యంలో జి కొత్తపల్లిలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. దీంతో అదనపు పోలీసులు బలగాలను మోహరించారు. ఎమ్మెల్యేకు రక్షణగా నిలిచిన పోలీసులు.. ఆయనను జి కొత్తపల్లి ఊరు దాటించడానికి నాలుగు గంటల సమయం పట్టింది.
గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో తొలుత పోలీసులు ఆయనకు రక్షణ కల్పించారు. అదనపు బలగాలు గ్రామంలోకి చేరుకున్న తర్వాత ఆయన టూవీలర్‌పై ఊరి బయటకు తీసుకొచ్చారు. అక్కడి నుంచి మరో వాహనం ఆయనను తరలించారు.
వివరాలు.. జి కొత్తపల్లి వైసీపీలో రెండు వర్గాలు ఉన్నాయని చెబుతున్నారు.అయితే ఈ రోజు ఉదయం వైసీపీ నాయకుడు గంజి ప్రసాద్ దారుణ హత్యకు గురయ్యాడు. గంజి ప్రసాద్ వైసీపీ గ్రామ ప్రెసిడెంట్‌గా ఉన్నాడు. ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే వెంకట్రావు.. హత్యకు గురైన గంజి ప్రసాద్ కుటుంబాన్ని పరామర్శించేందుకు జి కొత్తపల్లికి వెళ్లారు. అయితే ఎమ్మెల్యేను ప్రసాద్ వర్గీయులు అడ్డుకున్నారు. ఎమ్మెల్యే మద్దతు ఓ వర్గానికి ఉండటం వల్లే హత్య జరిగిందని ఆరోపిస్తూ ప్రసాద్ వర్గీయులు ఎమ్మెల్యేపై దాడికి దిగారు. తీవ్ర పదజాలంతో దూషిస్తూ.. ఎమ్మెల్యేపై పిడిగుద్దులు కురిపించారు.
దీంతో అప్రమత్తమైన పోలీసులు ఎమ్మెల్యేకు రక్షణ నిలిచారు. అతి కష్టం మీద ఎమ్మెల్యేను అక్కడి నుంచి పక్కకు తీసుకెళ్లారు. పోలీసులు పక్కకు తీసుకెళ్తున్న కూడా.. కొందరు ఎమ్మెల్యేపై దాడి చేశారు. ఎమ్మెల్యే వెంకట్రావుకు వ్యతిరేకంగా నినాదాలు దిగారు. దీంతో గ్రామంలో ఉద్రిక్తత కొనసాగుతోంది. ఈ ఘటనపై ఉన్నతాధికారులకు సమాచారం అందడంతో.. వారు గ్రామానికి అదనపు బలగాలను పంపారు.
ఇక, ఈ ఘటనపై హోం మంత్రి తానేటి వనిత స్పందించారు. గంజి ప్రసాద్‌ను దారుణంగా హత్య చేశారని.. ఈ ఘటన చాలా బాధకరమని అన్నారు. ప్రసాద్ కుటుంబ సభ్యులను పరామర్శించడానికి ఎమ్మెల్యేపై గ్రామస్తులు దాడికి పాల్పడ్డారని చెప్పారు. ఈ ఘటనపై ఎస్పీతో మాట్లాడానని.. పోలీసులు విచారణ చేపట్టారని చెప్పారు. జి కొత్తపల్లిలో ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉందన్నారు. మరోవైపు గంజి ప్రసాద్ హత్య కేసులో ముగ్గురు పోలీసులు ఎదుట లొంగిపోయారు.
ఇక, గంజి ప్రసాద్ గతంలో టీడీపీ తరపున సొసైటీ డైరెక్టర్ గా పని చేశారు. గత ఎన్నికల ముందు ఆయన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. అనుమానితుడు బజారయ్య వైసీపీ ఎంపీటీసీగా ఉన్నాడు. దీంతో గ్రామంలో వైసీపీ నేతలు రెండు వర్గాలుగా విడిపోయారు. గత ఎంపీటీసీ ఎన్నికల్లో బజారయ్యకు వ్యతిరేకంగా ప్రసాద్ పనిచేశారు. బజారయ్య వ్యతిరేకంగా అభ్యర్థిని నిలబెట్టారు. అయితే బజారయ్య ఎన్నికల్లో గెలిచాడు. ఇక, ప్రసాద్ ప్రస్తుత హోం మంత్రి తానేటి వనితకు గతంలో అనుచరుడిగా ఉన్నారు. మరోవైపు బజారయ్యకు ఎమ్మెల్యే వెంకట్రావు మద్దతు ఉందని చెబుతారు.