
రియాలిటీ షో బిగ్ బాస్‌పై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. బిగ్ బాస్ వంటి షోలతో యువత తప్పుదోవ పడుతుందని ఆవేదన వ్యక్తం చేసింది. అశ్లీలత, అసభ్యతను ప్రోత్సహించేదిగా బిగ్‌బాస్ షో ఉందని.. తెలుగు యువశక్తి అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి 2019లో హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై అత్యవసర విచారణ జరపాలని జగదీశ్వర్‌రెడ్డి తరఫు న్యాయవాది శివప్రసాద్‌రెడ్డి శుక్రవారం.. జస్టిస్ అసనుద్దీన్ అమానుల్లా, జస్టిస్ తర్లాడ రాజశేఖరరావులతో కూడిన ధర్మాసనంను కోరారు.
బిగ్‌బాస్ లాంటి కార్యక్రమాలు యువత భవిష్యత్‌ను కాలరాస్తున్నాయని జగదీశ్వర్‌రెడ్డి తరఫు లాయర్ హైకోర్టు ధర్మాసనం దృష్టికి తెచ్చారు. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ.. మంచి వ్యాజ్యం దాఖలు చేశారని పిటిషనర్‌పై ప్రశంసలు కురిపించింది. బిగ్‌బాస్ లాంటి చెత్త షోల వల్ల యువత జీవితాలు నాశనం అవుతున్నాయని.. యువత పెడదోవ పడుతోందని అభిప్రాయపడుతుంది. ఇన్ని రోజులు ఎవరూ ఎందుకు స్పందించలేదని తాము అనుకుంటున్నామని.. ఇలాంటి కార్యక్రమాలు సమాజంలో అశ్లీలతను పెంచుతున్నాయని వ్యాఖ్యానించింది.
అనర్థాలకు దారితీసే ఈ కార్యక్రమాల వల్ల సమాజం పాడవుతుందన్న విషయాన్ని అందరూ గుర్తించాలని సూచించింది. ఇలాంటి వాటిని ఎవరూ అడ్డుకోవడం లేదని, సమాజం ఎటుపోతోందో అర్థం కావడం లేదని అభిప్రాయపడింది. అభ్యంతరకర షోల విషయంలో జోక్యం అవసరం అని పేర్కొంది. బిగ్‌బాస్ షోను నిలిపేయాలంటూ దాఖలైన వ్యాజ్యంపై మే 2వ తేదీన విచారణ జరుపుతామని హైకోర్టు ధర్మాసనం తెలిపింది.