
కృష్ణా జిల్లా చల్లపల్లి బాలికల వసతి గృహంలో విద్యార్థినిలు అస్వస్థతకు గురయ్యారు. ఏడుగురు విద్యార్థినులు గత రాత్రి నుంచి వాంతులు, కడుపునొప్పితో బాధపడుతున్నారు. దీంతో వారిని వసతి గృహం సిబ్బంది సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వారికి చికిత్స కొనసాగుతుంది. విద్యార్థినిలు శుక్రవారం రాత్రి భోజనం చేసిన తర్వాత ఈ ఘటన చోటుచేసుకుంది. రాత్రి విద్యార్థినిలు తీసుకన్న ఆహారం కారణంగానే అస్వస్థతకు గురయ్యారని వైద్యులు భావిస్తున్నారు. దీనిపై అధికారులు స్పందించాల్సి ఉంది.
మరోవైపు అల్లూరు సీతారామరాజు జిల్లాలోని (Alluri Sitarama Raju district) పాడేరు మండలం తలరిసింగి గ్రామంలోని గిరిజన సంక్షేమ పాఠశాలకు చెందిన ఐదుగురు విద్యార్థులు గురువారం రాత్రి అస్వస్థతకు గురయ్యారు. హాస్టల్ మెస్‌లో రాత్రి భోజం చేసిన తర్వాత విద్యార్థులు వాంతులు చేసుకున్నారు. కడుపునొప్పితో బాధపడ్డారు. అయితే ఇది ఫుడ్ పాయిజన్ అని విద్యార్థుల తల్లిదండ్రులు భావించినప్పటికీ.. అజీర్తి కారణంగానే ఇలా జరిగినట్టుగా వైద్యులు చెప్పారు.
ఇందుకు సంబంధించి అల్లూరి సీతారామరాజు జిల్లా అదనపు డీఎంహెచ్‌వో లీలాప్రసాద్ మాట్లాడుతూ.. చిన్నపాటి వైరల్ ఫీవర్, అజీర్తి సమస్యతో విద్యార్థులు వాంతులు చేసుకున్నారని తెలిపారు. వెంటనే వారిని పాడేరులోని జిల్లా వైద్యశాలకు తరలించి చికిత్స అందించారని చెప్పారు. ప్రస్తుతం వారి పరిస్థితి నిలకడగా ఉందని వెల్లడించారు.