
తిరుమల నడక దారిలో దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. రాత్రి నడక దారిలో తప్పిపోయిన ఆరేళ్ల బాలిక శవమై తేలింది. చిరుత దాడిలో బాలిక మరణించింది. శనివారం ఉదయం బాలిక శవం నరసింహస్వామి ఆలయం వద్ద కనిపించింది. ఆరేళ్ల లక్షిత శుక్రవారం రాత్రి కనిపించకుండా పోయింది.
తిరుమల నడక దారిలో వెళ్తుండగా బాలిక తప్పిపోవడం గమనార్హం. కాగా, బాలికపై చిరుత దాడి చేసింది. దాంతో బాలిక మరణించింది. బాలిక తల్లిదండ్రులకు ముగ్గురు కుమారులు, ఒక కూతురు ఉన్నారు. వారంతా కలిసి తిరుమల దర్శనానికి కాలినడకగా వచ్చారు. ఆ సమయంలో బాలిక తప్పిపోయింది. దీంతో, వారు తమ కూతురు తప్పిపోయిందని ఫిర్యాదు చేశారు. శుక్రవారం రాత్రి 7.30 గంటల ప్రాంతంలో బాలిక తప్పిపోయింది. రాత్రి 10 గంటలకు కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
తమకు ఫిర్యాదు అందగానే పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. అయినా ఫలితం లేకుండాపోయింది. బాలికను చిరుత పంచేసినట్లు పోలీసులు గుర్తించారు. బాలిక కుటుంబ సభ్యులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నెల్లూరు జిల్లాకు చెందినవారు. బాలిక శవాన్ని రుయా ఆస్పత్రికి తరలించారు. శరీరభాగాలు చాలా వరకు లేని స్థితిలో బాలిక శవం ఉంది. లక్షితను చిరుతనే చంపినట్లు పోస్టుమార్టం నివేదికలో తేలింది. చిన్నారి శవాన్ని నెల్లూరుకు తరలించారు.చిరుత దాడి చేసినట్లు ఫోరెన్సిక్ నిపుణులు గుర్తించారు.
నెల క్రితం ఐదేళ్ల బాలుడిపై చిరుత దాడి చేసిన విషయం తెలిసిందే. అయితే, బాలుడు ప్రమాదం నుంచి అప్రమత్తత కారణంగా బతికి బయటపడ్డాడు. తిరుమల నడక దారిలో ఒంటరిగా వెళ్లవద్దని, గుంపులుగా వెళ్లాలని టిటిడి అధికారులు పలుమార్లు హెచ్చరించారు.
తాజా ఘటనతో నడక మార్గంలో ప్రయాణించే శ్రీవారి భక్తులు వణికపోతున్నారు. రోజుకు 25 వేల మంది వరకు భక్తులు నడక మార్గంలో వెళ్తుంటారు. నడక మార్గంలో 3 వేల 550 మెట్లు ఉన్నాయి.