
సూపర్‌స్టార్ కృష్ణ సోదరుడు, నిర్మాత ఘట్టమనేని ఆదిశేషగిరిరావు టీడీపీలో చేరుతున్నట్లు స్పష్టమైన ప్రకటన చేశారు. వైసీపీకి రాజీనామా చేసిన ఆయన తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారని ప్రకటించినప్పటికీ, ఆయన ఎక్కడ నుంచి పోటీ చేస్తారు..? ఎలాంటి కార్యక్రమాలు చేపట్టనున్నారు తదితర విషయాలపై క్లారిటీ రాలేదు.
దీంతో ఘట్టమనేనిని పార్టీలోకి ఆహ్వానించేందుకు టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు ఆదేశాలతో ఆర్టీసీ ఛైర్మన్ వర్ల రామయ్య, పార్టీ చీఫ్ విప్ బుద్దా వెంకన్న, విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, తెనాలి ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్రప్రసాద్ తదితరులు ఘట్టమనేని స్వగ్రామం బుర్రిపాలెం వచ్చారు.
సుమారు గంటన్నర సేపు చర్చల అనంతరం ఆదిశేషగిరిరావు తాను తెలుగుదేశం పార్టీలో చేరుతున్నట్లు స్పష్టమైన ప్రకటన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. విభజనతో సమస్యలతో సతమతమవుతున్న రాష్ట్రం సుభిక్షంగా ఉండాలంటే చంద్రబాబు మరోసారి ముఖ్యమంత్రి కావాల్సిన అవసరం ఉందన్నారు.
అభివృద్ధి, సంక్షేమం కోసం సీఎం సాహోసేపత నిర్ణయాలు నచ్చి ఆయనకు అభినందనలు తెలిపానన్నారు. అందుకే వైసీపీని వదిలి టీడీపీలో చేరుతున్నట్లు ఆదిశేషగిరిరావు స్పష్టం చేశారు. తన నిర్ణయానికి ముందు అన్నయ్య కృష్ణ, మహేశ్ బాబు అభిమానులతో చర్చించానని వారి నుంచి సానుకూల స్పందన వచ్చిందన్నారు.
నందమూరి, కృష్ణ, మహేశ్ బాబు అభిమాన సంఘాలు చంద్రబాబు గెలుపుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఇకపై ఘట్టమనేని, గల్లా కుటుంబాలు ఏకతాటిపై నడుస్తాయన్నారు. తెనాలి నుంచి మరోసారి ఆలపాటి రాజేంద్రప్రసాద్ పోటీ చేస్తారని, ఆయనకు అన్ని విధాలా సహకరిస్తారని ఘట్టమనేని వెల్లడించారు.
ఈ నెల 7వ తేదీ బుధవారం విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరుతున్నట్లు ప్రకటించారు. తన రాజకీయ భవితవ్యం పార్టీ అధిష్టానం నిర్ణయిస్తుందని, అధినేత ఆదేశాల మేరకు పనిచేస్తానన్నారు.
టీడీపీలోకి ఆదిశేషగిరిరావు చేరే ముహుర్తమిదే!