
ఉమ్మడి చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరుకు రాజకీయంగా ఎంతో ప్రత్యేకత వుంది. గతంలో వున్న వేపంజరి రద్దయి.. గంగాధర నెల్లూరు ఏర్పడింది. ఈ నియోజకవర్గం ఎస్సీ రిజర్వ్‌డ్ . 2009లో నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా గంగాధర నెల్లూరు, పెనమలూరు మండలాలు .. పుత్తూరు నియోజకవర్గం నుంచి ఎస్సార్ పురం, పాలసముద్రం మండలాలు.. నగరి నియోజకవర్గం నుంచి కార్వేటి నగరం మండలం, వెదురుకుప్పం మండలాలు జీడీ నెల్లూరు పరిధిలోకి వచ్చాయి. గంగాధర నెల్లూరు పేరు చెప్పగానే దివంగత నేత కుతూహలమ్మ గుర్తొస్తారు. జెడ్పీ ఛైర్‌పర్సన్, ఎమ్మెల్యే, మంత్రిగా, డిప్యూటీ స్పీకర్‌గా ఆమె పనిచేశారు. జీడీ నెల్లూరులో పలు అభివృద్ధి కార్యక్రమాలను కుతుహలమ్మ చేపట్టారు.
గంగాధర నెల్లూరు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2024 .. కుతుహలమ్మ హవా :
గంగాధర నెల్లూరు నియోజకవర్గానికి 2009 నుంచి నేటి వరకు 3 సార్లు ఎన్నికలు జరగ్గా.. 2009లో కాంగ్రెస్ తరపున కుతుహలమ్మ.. 2014, 2019లలో వైపీపీ నేత నారాయణ స్వామి ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. వేపంజరి నియోజకవర్గం వున్నప్పుడు కాంగ్రెస్ ఆరు సార్లు, టీడీపీ రెండు సార్లు, జనతా పార్టీ ఒకసారి, స్వతంత్ర అభ్యర్ధి ఒకసారి విజయం సాధించాయి. 2019 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్ధి నారాయణ స్వామికి 1,03,038 ఓట్లు.. టీడీపీ అభ్యర్ధి అనగంటి హరికృష్ణకు 57,444 ఓట్లు పోలయ్యాయి. మొత్తంగా 45,594 ఓట్ల మెజారిటీతో నారాయణ స్వామి బంపర్ విక్టరీ అందుకున్నారు. అంతేకాదు.. వైఎస్ జగన్ కేబినెట్‌లో ఆయన డిప్యూటీ సీఎంగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.