ఆ పోస్టులు పెడితే అడ్మిన్లకు చుక్కలే.. స్టేటస్ పెట్టుకున్నా వదలం - ఏపీ డీజీపీ స్ట్రాంగ్ వార్నింగ్

Published : Jun 03, 2024, 01:52 PM ISTUpdated : Jun 03, 2024, 03:21 PM IST
ఆ పోస్టులు పెడితే అడ్మిన్లకు చుక్కలే.. స్టేటస్ పెట్టుకున్నా వదలం - ఏపీ డీజీపీ స్ట్రాంగ్ వార్నింగ్

సారాంశం

‘‘కౌంటింగ్ తర్వాత మీ అంతు చూస్తామంటూ కొంతమంది వ్యక్తులు సోషల్ మీడియా వేదికగా ప్రత్యర్థి శిబిరాలకు సవాలు విసురుతూ సమాజంలో అశాంతి సృష్టిస్తున్నారు. మరికొందరు వ్యక్తిగత దూషణలకు పాల్పడుతూ ఘర్షణలు సృష్టిస్తున్నారు. అలాంటి వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోము’’ అని ఏపీ డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా స్పష్టం చేశారు.

సార్వత్రిక ఎన్నికల పర్వం దాదాపు ముగింపు దశకు చేరుకుంది. మరికొద్ది గంటల్లో ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఘర్షణలకు దారి తీసే ప్రతి అంశంపైనా ఎన్నికల సంఘం, పోలీసు శాఖ ప్రత్యేక దృష్టి పెట్టింది. ఇప్పటికే సోషల్‌ మీడియాను ఈసీ, నిఘా విభాగాలు జల్లెడ పడుతున్నాయి. విద్వేషపూరితమైన, రెచ్చగొట్టే పోస్టింగుల విషయంలో కొరడా ఝళిపిస్తోంది పోలీసు యంత్రాంగం. 

ఇక, ఆంధ్రప్రదేశ్‌ పోలీసు బాస్‌, డీజీపీ హరీశ్‌కుమార్‌ గుప్తా కూడా రంగంలోకి దిగారు. సోషల్ మీడియా వేదికగా బెదిరింపులకు పాల్పడే వారిపై  కఠిన చర్యలు తీసుకుంటామని డీజీపీ కార్యాలయం స్పష్టం చేసింది. ‘‘కౌంటింగ్ తర్వాత మీ అంతు చూస్తామంటూ కొంతమంది వ్యక్తులు సోషల్ మీడియా వేదికగా ప్రత్యర్థి శిబిరాలకు సవాలు విసురుతూ సమాజంలో అశాంతి సృష్టిస్తున్నారు. మరికొందరు వ్యక్తిగత దూషణలకు పాల్పడుతూ ఉద్రిక్తలు సృష్టిస్తున్నారు. అలాంటి వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోము’’ అని డీజీపీ స్పష్టం చేశారు. ఘర్షణలు, అల్లర్లకు సామాజిక మాధ్యమాల ద్వారా కారణమయ్యే వారిపై IT act కింద కేసులు నమోదు చేయడంతో పాటు రౌడీ షీట్లు ఓపెన్ చేయటం, PD ACT ప్రయోగించడం లాంటి కఠిన చర్యలు తీసుకుంటామని డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా హెచ్చరించారు. 

గొడవలు, ఘర్షణలు, హింసకు దారితీసే పోస్టింగులు సోషల్ మీడియాలో పెట్టినవారితో పాటు.. వారిని ప్రోత్సహిస్తున్నవారినీ వదిలిపెట్టేది లేదని ఆంధ్రప్రదేశ్ పోలీస్ బాస్ తేల్చి చెప్పారు. అల్లర్లకు దారితీసే సోషల్ మీడియా పోస్టింగులు ఎవరి ప్రోద్భలంతో పెడుతున్నారో కూడా విచారణ చేస్తామని, ఎట్టిపరిస్థితుల్లోనూ అలాంటివారిని ఉపేక్షించబోమని హెచ్చరించారు. 

అలాగే, రెచ్చగొట్టేలా, బెదిరించేలా ఉన్న పోస్టులను, ఫోటోలను, వీడియోలను వాట్సాప్ స్టేటస్ గా పెట్టుకోవడం లేదా  షేర్ చేయడం కూడా నిషిద్ధమని డీజీపీ కార్యాలయం స్పష్టం చేసింది. సోషల్ మీడియా గ్రూప్ ల అడ్మిన్ లు కూడా అటువంటి పోస్టింగులు ప్రోత్సహించకూడదని తెలిపారు. సోషల్ మీడియా పోస్టులపై పోలీస్ శాఖ నిరంతర నిఘా ఉంటుందనే విషయాన్ని గుర్తించుకోవాలని డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.

కాగా, ఆంధ్రప్రదేశ్ లో 175 అసెంబ్లీ స్థానాలు, 25 లోక్ సభ స్థానాలకు మే 13న పోలింగ్ జరిగింది. ఈవీఎంలలో ఓటర్లు నిక్షిప్తం చేసిన తీర్పు మరికొన్ని గంటల్లోనే వెల్లడి కానుంది. 22 రోజుల నిరీక్షణకు తెరపడటంతో పాటు గెలిచేదెవరో, పరాజయం పాలయ్యేదెవరో తేలనుంది. మరోసారి అధికార పీఠాన్ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ దక్కించుకుంటుందో... లేదా టీడీపీ-జనసేన- బీజేపీ కూటమికి అధికారం దక్కతుందో తెలిసిపోతుంది.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Palla Srinivas on Lokesh Birthday: లోకేష్అంటే నమ్మకం.. నిత్యంప్రజల్లోనే ఉంటారు | Asianet News Telugu
Legendary Actor Krishnam Raju 86th Birth Anniversary | Free Mega Diabetes Camp | Asianet News Telugu