
తెలుగుదేశం పార్టీ, బీజేపీలపై ఆంధ్రప్రదేశ్ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి (Gadikota Srikanth Reddy) తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) క్యాసినో పేరుతో రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. వైసీపీ ప్రభుత్వం జూదాన్ని ఎప్పుడూ ప్రోత్సహించలేదని అన్నారు. ప్రభుత్వంపై బుదర జల్లడమే చంద్రబాబు పనిగా పెట్టుకున్నారని విమర్శించారు. కావాలనే ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వాలను కించపరిచే విధంగా ప్రవర్తించడం సరికాదన్నారు. ప్రతిపక్ష నాయకుడిగా చంద్రబాబు ఏ రోజు ఈ రాష్ట్ర శ్రేయస్సు కోరుకోడని విమర్శించారు. తన స్వార్ధం కోసం ఎవరినైనా బలి చేయాలని చూస్తాడని చెప్పుకొచ్చారు. చంద్రబాబు తన పబ్బం గడుపుకోవడానికి ఎంతవరకైనా వెళ్తాడని విమర్శలు గుప్పించారు. చంద్రబాబు స్వార్ధపూరిత రాజకీయాలు మానుకోవాలన్నారు.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చాక అధికారులను తన ప్రయోజనాల కోసం వాడుకునే ప్రయత్నం చేయలేదన్నారు. ప్రజలకు ఉపయోగపడాలని, వారికి దగ్గరగా ఉండాలనే ఆలోచనే చేశారని అన్నారు. సంక్షేమ పథకాలను కుల, మతాలకు అతీతంగా అందజేస్తున్నారని చెప్పారు. ప్రభుత్వంపై ఆర్థిక భారం పడినా సీఎం జగన్ వెనకడుగు వేయలేదని చెప్పారు. కరోనా సమయంలో రాష్ట్ర ఆదాయం తగ్గిందని తెలిపారు. కష్ట పరిస్థితుల్లో కూడా సీఎం జగన్ జీతాలు పెంచారని అన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని కూడా ఉద్యోగులు గమనించాలని కోరారు. పీఆర్సీ వల్ల ప్రభుత్వంపై పది కోట్ల రూపాయలకు పైగా ఆర్థిక భారం పడుతుందన్నారు. ప్రభుత్వాన్ని అస్థిరపరచాలనే వారి ట్రాప్‌లో ఉద్యోగులు పడొద్దని కోరారు. అందరికీ మేలు చేయాలనే ఆలోచన వైఎస్ జగన్ ప్రభుత్వానిదని చెప్పారు.
మంత్రిని చంపేస్తానని బుద్దా వెంకన్న మాట్లాడుతున్నారు. చంపేస్తానని అనాగరికంగా మాట్లాడటం కరెక్టా అని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని అస్థిర పరచాలని చంద్రబాబు ఆలోచిస్తున్నారని ఆరోపించారు. టీడీపీ హయాంలో బెల్ట్ షాప్‌లను ఇష్టానుసారం నడిపారని అన్నారు. బెల్ట్ షాప్‌లను మూసివేయించిన ఘనత సీఎం వైఎస్ జగన్‌దేనని అన్నారు. ఎన్టీఆర్ తీసుకొచ్చిన మద్యపాన నిషేధాన్ని ఎత్తివేసిన ఘనత చంద్రబాబుకే చెల్లిందని ఎద్దేవా చేశారు.
మరోవైపు బీజేపీ మతతత్వాన్ని రెచ్చగొట్టి లబ్ది పొందాలనే ఆలోచనలు చేస్తుందని శ్రీకాంత్ రెడ్డి ఆరోపించారు. ఒక వర్గాన్ని రెచ్చగొట్టి.. శాంతిభద్రతల సమస్య సృష్టించాలనే ఆలోచన మంచిది కాదన్నారు.