అసెంబ్లీలో చంద్రబాబు కుర్చీలో బాలకృష్ణ కూర్చోవడంపై మాజీ మంత్రి పేర్ని నాని ప్రశ్నించారు.
అమరావతి:చంద్రబాబు నాయుడు జైలుకు వెళ్లగానే ఆయన సీట్లో బాలకృష్ణ కూర్చోవడం దేనికి సంకేతమని మాజీ మంత్రి పేర్ని నాని ప్రశ్నించారు.ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కేసులో ఏపీ అసెంబ్లీలో శుక్రవారం నాడు స్వల్పకాలిక చర్చ జరిగింది.ఈ చర్చలో ఇవాళ ఏపీ అసెంబ్లీలో చోటు చేసుకున్న పరిణామాలను ప్రస్తావిస్తూ పేర్ని నాని బాలకృష్ణపై సెటైర్లు వేశారు. చంద్రబాబు అసెంబ్లీకి రాకపోతే ఆయన సీట్లో ఎవరూ కూర్చోరన్నారు. సీఎం జగన్ అసెంబ్లీకి రాకపోతే ఆయన సీట్లో ఎవరూ కూర్చోరని ఆయన చెప్పారు.
కానీ చంద్రబాబు జైలుకు వెళ్లగానే అసెంబ్లీలో బాబు సీట్లో బాలకృష్ణ కూర్చోన్నారన్నారు. ఏపీ అసెంబ్లీలో ఇవాళ చంద్రబాబు కుర్చీలో నిలబడి బాలకృష్ణ విజిల్ ఊదడాన్ని పేర్ని నాని ప్రస్తావించారు. స్కిల్ డెవలప్ మెంట్ స్కీమ్ ద్వారా రెండు లక్షల మందికి ట్రైనింగ్ ఇచ్చినట్టుగా బాలకృష్ణ చెబుతున్నారన్నారు. ఎవరో రాసిచ్చిందో చదవడం కంటే వాస్తవాలు తెలుసుకోవాలని పేర్ని నాని బాలకృష్ణకు సూచించారు.
also read:ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్‌కి బాబే కారణం: ఏపీ అసెంబ్లీలో పేర్నినాని
ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబును ఈ నెల 9న ఏపీ సీఐడీ అధికారులు అరెస్ట్ చేశారు. చంద్రబాబు అరెస్ట్ ను నిరసిస్తూ ఏపీ అసెంబ్లీలో టీడీపీ సభ్యులు నిరసనకు దిగుతున్నారు. నిన్న , ఇవాళ కూడ ఏపీ అసెంబ్లీలో టీడీపీ సభ్యులు ఆందోళనలను కొనసాగించారు. చంద్రబాబు అక్రమ అరెస్ట్ పై చర్చకు టీడీపీ సభ్యులు పట్టుబట్టారు. ఈ డిమాండ్ తో ఇవాళ టీడీపీ సభ్యులు సభలో ఆందోళనకు దిగారు. ఈ క్రమంలోనే టీడీపీ సభ్యులు విజిల్స్ ఊదుతూ నిరసనకు దిగారు. బాలకృష్ణ స్పీకర్ పోడియం వద్ద నిలబడి విజిల్ ఊది నిరసనకు దిగారు.ఈ సమయంలో వైఎస్ఆర్సీపీ సభ్యులకు, టీడీపీ సభ్యులకు మధ్య మార్షల్స్ అడ్డుగా నిలిచారు. టీడీపీ సభ్యుల ఆందోళనల నేపథ్యంలో అసెంబ్లీలో గందరగోళ పరిస్థితులు నెలకొనడంతో ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం రెండు దఫాలు అసెంబ్లీని వాయిదా వేశారు. మరో వైపు అసెంబ్లీలో విజిల్స్ ఊదుతూ నిరసనకు దిగిన ముగ్గురు టీడీపీ ఎమ్మెల్యేలను ఇవాళ ఒక్క రోజు అసెంబ్లీ నుండి సస్పెండ్ చేస్తున్నట్టుగా స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రకటించారు. మరో వైపు అసెంబ్లీలో వీడియో చిత్రీకరించినందుకు అచ్చెన్నాయుడు, బెందాళం ఆశోక్ లను ఈ సెషన్ మొత్తం సస్పెండ్ చేశారు ఏపీ అసెంబ్లీ స్పీకర్.