చంద్రబాబు ఓటమికి మొక్కు: తిరుపతి యాత్రకు మోత్కుపల్లి

First Published Jul 10, 2018, 6:13 PM IST
Highlights

వచ్చే ఎన్నికల్లో చంద్రబాబునాయుడు ఓటమి చెందాలని మొక్కేందుకు మాజీ మంత్రి , టీడీపీ బహిష్కృత నేత మోత్కుపల్లి నర్సింహులు మంగళవారం సాయంత్రం తిరుపతికి బయలుదేరారు. బుధవారం నాడు ఆయన స్వామివారిని దర్శించుకొంటారు.

హైదరాబాద్: టీడీపీ బహిష్కృత నేత మోత్కుపల్లి నర్సింహులు  మంగళవారం సాయంత్రం తిరుపతికి బయలుదేరి వెళ్లారు. బుధవారం నాడు  తిరుపతి శ్రీవెంకటేశ్వరస్వామని దర్శించుకొంటారు.చంద్రబాబునాయుడు తిరిగి గెలవకూడదని వెంకన్నను మొక్కుకొంటానని  మోత్కుపల్లి నర్సింహులు ప్రకటించారు. దీంతో మోత్కుపల్లి నర్సింహులు తిరుపతి పర్యటన ఆసక్తిని కల్గిస్తోంది.

ఎన్టీఆర్ జయంతి, వర్థంతిలను పురస్కరించుకొని ఏపీ సీఎం చంద్రబాబునాయుడుపై  మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో టీడీపీ నుండి మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులును పార్టీ నుండి బహిష్కరిస్తున్నట్టు  టీడీపీ ప్రకటించింది.

అయితే పార్టీ నుండి బహిష్కరించిన తర్వాత చంద్రబాబుపై  మోత్కుపల్లి నర్సింహులు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. శత్రువుకు శత్రువు మిత్రుడనే చందంగా  కాపు రిజర్వేషన్ పోరాట సమితి నేత మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం, వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిలు  మోత్కుపల్లి నర్సింహులును ఆయన ఇంట్లో కలిశారు.

అయితే ఈ సమయంలో త్వరలోనే తాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పర్యటిస్తానని  మోత్కుపల్లి నర్సింహులు ప్రకటించారు. తిరుపతికి వెళ్లి చంద్రబాబునాయుడు మరోసారి సీఎం కాకూడదని వెంకన్నను వేడుకొంటానని ప్రకటించారు. 

ఇందులో భాగంగానే  మాజీ మంత్రి నర్సింహులు మంగళవారం నాడు  తిరుపతికి బయలుదేరి వెళ్లారు.  బుధవారం నాడు ఉదయం 9 గంటలకు అలిపిరి నుండి కాలినడకన స్వామివారిని దర్శించుకోనున్నారు. బాబు మరోసారి ఏపీకి సీఎం కాకూడదని మొక్కుకొంటారు. స్వామివారిని దర్శించుకొన్న తర్వాత ఆయన మీడియాతో మాట్లాడే అవకాశం ఉందని సమాచారం.

మోత్కుపల్లి నర్సింహులు తిరుపతి వేదికగా బాబుపై ఏ రకమైన విమర్శలు చేస్తారనే విషయమై సర్వత్రా ఆసక్తి నెలకొంది. టీడీపీలో ఉన్న కాలంలో తెలంగాణలో కేసీఆర్ లక్ష్యంగా నర్సింహులు విమర్శలు గుప్పించారు.  అయితే మారిన పరిస్థితుల్లో మోత్కుపల్లి నర్సింహులు చంద్రబాబుపై విమర్శలు చేయడంతో  ఆయనను పార్టీ నుండి బహిష్కరించారు. 

ఇదిలా ఉంటే చంద్రబాబు నాయుడు వ్యతిరేక శక్తులన్ని ఏకమై ఆ దుర్మార్గుడిని రాజకీయంగా బొందపెట్టాలని ఆ దేవుడిని వేడుకుంటానని మోత్కుపల్లి నర్సింహులు చెప్పారు. దళితులు, బలహీనవర్గాలు చంద్రబాబు మాటలు నమ్మి మోసపోవద్దనన్నారు.. దిక్కులేని వాడికి దేవుడే దిక్కని తన 64వ జన్మదినం రోజున తన మానసిక క్షోభను దేవుడికి చెప్పుకునేందుకే తిరుమల వెళ్తున్నట్టు నర్సింహులు చెప్పారు. 

 

 

click me!