వైఎస్ వివేకా హత్య జరిగిన రోజున బాబు కాల్ రికార్డులపై సీబీఐ విచారణ: కొడాలి నాని డిమాండ్

By narsimha lode  |  First Published Feb 4, 2023, 2:42 PM IST

వైఎస్ వివేకానందరెడ్డి హత్య  జరిగిన  రోజున చంద్రబాబు కడప జిల్లాకు చెందిన టీడీపీ నేతలతో  ఏం మాట్లాడారో బయటకు రావాల్సిన అవసరం ఉందని  మాజీ మంత్రి  కొడాలి నాని  చెప్పారు.  సీబీఐ విచారణ చేస్తేనే  ఈ  అంశాలు బయటకు వస్తాయన్నారు.  
 


అమరావతి: వైఎస్ వివేకానందరెడ్డి హత్య  జరిగిన  రోజున చంద్రబాబు  కాల్ రికార్డులపై  సీబీఐ విచారణ జరపించాలని  మాజీ మంత్రి  కొడాలి నాని  డిమాండ్  చేశారు. శనివారం నాడు అమరావతిలో  మాజీ మంత్రి కొడాలి నాని  మీడియాతో మాట్లాడారు. 
 వివేకానంద రెడ్డి   హత్య  జరిగినప్పుడు  సీఎంగా  చంద్రబాబే ఉన్నారని  కొడాలి నాని  గుర్తు  చేశారు.   ఆ రోజు  చంద్రబాబు కడప జిల్లాకు చెందిన టీడీపీ నేతలు ,  పోలీసులతో  ఏం మాట్లాడారో బయట పెట్టాల్సిన అవసరం ఉందన్నారు.  చంద్రబాబు  ఫోన్ కాల్స్ పై  సీబీఐ విచారణ  జరిపించాలని   మాజీ మంత్రి కొడాలి నాని  డిమాండ్  చేశారు.

చంద్రబాబునాయుడు  సీఎంగా  ఉన్న సమయంలో  కడప జిల్లాకు  గంటా శ్రీనివాసరావును ఇంచార్జీగా  పెట్టి   వివేకానందరెడ్డి  ఎమ్మెల్సీగా  ఓటమికి కారణమయ్యారన్నారు. ఎన్నికల ముందు  వివేకాను చంపి ఆ కేసును జగన్ పై పెట్టే  ప్రయత్నం  చేశారని  కొడాలి నాని  ఆరోపించారు.  వివేకానందరెడ్డిని  అక్కున చేర్చుకున్న  హృదయం  జగన్ కు ఉందన్నారు.  

Latest Videos

undefined

వైఎస్ వివేకానందరెడ్డి   హత్య జరిగిన రోజున  కడప ఎంపీ  వైఎస్ అవినాష్ రెడ్డి  నవీన్ కు ఫోన్  చేశారంటూ  ఇష్టానుసారం మాట్లాడుతున్నారన్నారు.  సీఎం జగన్ తో  మాట్లాడాలంటే  అక్కడి సిబ్బందికే ఫోన్  చేయాల్సిందేనన్నారు. 

మీ నాన్న దెబ్బకు  మీ బాబాయి  ఏమామయ్యారో తెలీదన్నారు.  పండగకు  నారావారాపల్లెలో  మీ బాబాయి  ఎందుకు  కన్పించడం లేదో  చెప్పాలని కొడాలి నాని అడిగారు.  మొదట మీ బాబాయిని చూపించాలని  కొడాలి నాని  లోకేష్  ను డిమాండ్  చేశారు..

ప్రతిపక్ష నేత చంద్రబాబు పాదయాత్ర చేయలేక  ఆయన కొడుకును పాదయాత్రకు  పంపించాడన్నారు.  రోజుకు  కనీసం  10 కి.మీ నడవడానికి కూడా లోకేష్ ఆయాసపడుతన్నాడన్నారు నోరు తిరగక లోకేష్  ప్రజల్ని చంపుతున్నాడని  కొడాలి నాని సెటైర్లు  వేశారు.  

ఏపీ సీఎం జగన్ పై  ఇష్టానుసారం మాట్లాడుతున్నారని   లోకేష్ తీరుపై  ఆయన మండిపడ్డారు.   ఒళ్లు దగ్గర పెట్టుకుని  మాట్లాడాలని  లోకేష్ కు  సూచించారు మాజీ మంత్రి కొడాలి నాని.   నారావారిపల్లె  నుండి  చంద్రబాబు కుటుంబం  వలస వెళ్లలేదా  అని  కొడాలి నాని  ప్రశ్నించారు.  చంద్రగిరి నుండి చంద్రబాబు కుప్పం అసెంబ్లీ నియోజకవర్గానికి వలస వెళ్లలేదా అని   ఆయన అడిగారు. మరో వైపు చంద్రబాబు దత్తపుత్రుడు   పవన్ కళ్యాణ్  గాజువాక, భీమవరానికి  వలస వెల్లలేదా  అని  కొడాలి నాని  ప్రశ్నించారు.

ఎన్టీఆర్ వారసులు  పార్టీలోకి వస్తుంటే  ఎందుకు  వారి  గుండెపోట్లు  వస్తున్నాయో అర్ధం కావడం లేదన్నారు.  ఎన్టీఆర్ కు వెన్నుపోటు  పొడిచి  సీఎం పదవి లాక్కున్న వ్యక్తి చంద్రబాబు   అని  మాజీ మంత్రి కొడాలి నాని  విమర్శించారు.  ఎన్టీఆర్ మృతిపై  హరికృష్ణ డిమాండ్  చేసినా  కూడా  ఎందుకు  విచారణ చేయలేదో  చెప్పాలన్నారు. 
 

click me!