
రాజమండ్రి: టీడీపీలోకి జూనియర్ ఎన్టీఆర్ సహా అనేక మంది రాబోతున్నారని మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి చెప్పారు.
టీడీపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మీడియాతో మాట్లాడారు. క్షేత్రస్థాయిలో ఉన్న పరిస్థితి ఆధారంగా ఆయా వర్గాల నుండి పార్టీలోకి అనేక మంది వస్తారని ఆయన చెప్పారు.
అనేక సామాజికవర్గాలు, ప్రాంతాల నుండి క్షేత్రస్థాయిలో నుండి పార్టీ నాయకత్వం రానుందని ఆయన తెలిపారు.ఎవరికివారే రావాలని కాదు పార్టీని కాపాడుకొనేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆయన కోరారు.
పార్టీలోకి ఎంతో మంది వస్తారని ఆయన తెలిపారు. టీడీపలో వ్యవస్థాగతంగా మార్పులు రానున్నాయని ఆయన వివరించారు.పార్టీలో పెను మార్పులు వస్తాయని ఆయన స్పష్టం చేశారు. ఈ విషయమై జూనియర్ ఎన్టీఆర్ ఏ రకంగా స్పందిస్తారో చూడాలి.
గ్రామపంచాయితీ ఎన్నికల్లో కుప్పంలో టీడీపీ ఓటమి పాలైన తర్వాత నియోజకవర్గంలో చంద్రబాబునాయుడు పర్యటించిన సమయంలో జూనియర్ ఎన్టీఆర్ ను ప్రచారానికి పంపాలని ఆ పార్టీ కార్యకర్తలు చంద్రబాబునాయుడును కోరారు.
ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో 2009లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జూనియర్ ఎన్టీఆర్ టీడీపీ తరపున ప్రచారం చేశారు.